ఒకానొకప్పుడు కోసలదేశాన్ని రఘునందనుడనే రాజు పాలించేవాడు. ఆయన భార్య సీత.సమీపారణ్యంలోని క్రూరమృగాలు నగరవాసులమీద దాడిచేసి బాధిస్తున్నాయని రఘునందనుడికి తెలిసింది. ఆ ప్రమాదం నివారించడానికి వేటకు బయల్దేరాడాయన. అప్పుడు మహారాణి సీత కూడా వేటకువెళ్లి అడవిని చూడాలని సరదాపడింది. రాజు కాదనలేకపోయాడు.

అలా రఘునందనుడు వారంరోజులపాటు అడవిలోనే ఉండి నగరవాసులకు క్రూరమృగాల బాధ లేకుండా చేశాడు. అప్పటికి వేటలో బాగా అలసిపోవడంవల్ల ఒకరోజు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అటువంటి సమయంలో మహాకాయుడైన రాక్షసుడొకడు మెరుపుదాడి చేసి సీతను ఎత్తుకుని ఆకాశమార్గాన పారిపోయాడు. వాణ్ణి ఎదుర్కోవడం రాజుకు, సైనికులకు కూడా సాధ్యపడలేదు. అప్పటికి చేసేది లేక సైనికులతో సహా రాజ్యానికి తిరిగి వెళ్లిన రఘునందనుడు -తన సోదరుడైన లఘునందనుడికి రాజ్యభారం అప్పగించి తను మళ్లీ అడవికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు.మంత్రులు ఆయన్ని వారించి, ‘‘మహారాణిని రక్షించి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. మనం సైన్యంతో వెళ్లి రాక్షసుణ్ణి చంపి రాణిని కాపాడి తీసుకొద్దాం’’ అన్నారు.

రఘునందనుడు ఒప్పుకోలేదు.‘‘ఆ రాక్షసుడు మాయావి, మహాశక్తిమంతుడు. నేను, మన సైనికులు కలిసి కూడా వాణ్ణి ఏమ ఈ చేయలేకపోయాం. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడిని ఎలా ఎదిరించాలో తెలియదు. నా రాజ్యం, నా ప్రజలు ఇబ్బందులకు గురికావడం నాకు ఇష్టం లేదు. నేను అడవికి వెళ్లి తపస్సు చేసి ఆ రాక్షసుణ్ణి ఎదిరించేశక్తి సంపాదించి నా భార్యను వెనక్కు తెచ్చుకుంటాను. నన్ను ఆపవద్దు’’ అన్నాడు.లఘునందనుడు దీనికి అంగీకరించి, ‘‘అన్నా! అలనాటి భరతుడిలా నీ పాదుకలు మాత్రం సింహాసనం మీద ఉంచి రాజ్యం పాలిస్తాను. నీవు వదినగారిని వెనక్కుతెచ్చే శుభగడియలకోసం ఎదురుచూస్తూంటాను. ఎన్నటికీ నీవే కోసలకు ప్రభువు’’ అన్నాడు.