అపూర్వం అనిపించే మహాభారతం.. వింటే పాపాలన్నీ మటుమాయం

పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో మునులంతా సమావేశమయ్యారు. లోకకల్యాణంకోసం శౌనకముని వందేళ్ళ సత్రయాగం చేస్తున్నాడు. దానిని చూసేందుకు సూతుడు వచ్చాడక్కడికి. అతను కథకచక్రవర్తి. వ్యాసుడు శిష్యుడు, రోమహర్హణుడి కుమారుడతను. పురాణాలన్నీ అతనికి కంఠోపాఠం. సూతుణ్ణి చూడగానే అక్కడివారంతా అతన్ని చుట్టుముట్టారు. అనేకవిధాల గౌరవించారు. పుణ్యకథలు వినిపించమన్నారు. తప్పకుండా అన్నాడు సూతుడు. అడిగాడిలా.చెప్పండి! మీకు ఎలాంటి కథ కావాలి? ఏ కథ నన్ను చెప్పమంటారు?ఏదైనా మంచికథ కావాలి. అపూర్వం అనిపించాలి అన్నారు మునులు.నువ్వు చెప్పిన కథ వింటే మనసుకెక్కాలి. జ్ఞానం కలగాలి. తెలిసో తెలియకో పాపాలు చేస్తే అవి పోవాలి అన్నారు.అయితే మహాభారతం కథ చెబుతాను, వినండి అన్నాడు సూతుడు. చెప్పసాగాడిలా.ఆదికాలంలో వేదాలన్నీ కలగాపులగంగా ఒక్క దగ్గరే ఉండేవి. ఏది ఏ వేదమో చెప్పడానికి వీలుండేదికాదు. అవన్నీ విడమరచినవాడు వ్యాసుడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం...అని నాలుగు వేదాలను విభజించాడు. పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని...నలుగురు శిష్యులకీ వాటిని వివరించి, ఆ నాలుగింటికీ సూత్రాలు రాయించాడు. అలా వేదవ్యాసుడయ్యాడతను. అతను రాసిన పుణ్యకథే మహాభారతం.

 

పద్దెనిమిదిపురాణాలు, ధర్మశాస్త్రాల అర్థాలు, వేదవేదాంతాల తాత్పర్యాలు, ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన కథలు, ఇతిహాసాలు, వంశచరిత్రలు, శ్రీకృష్ణమహాత్మ్యం, భారతవీరులగుణాలు...అన్నీ ప్రతిఫలించేట్టుగా మహాభారతం రాశాడు వ్యాసుడు. ఇది రాసేందుకు అతనికి మూడేళ్ళు పట్టింది.ధర్మతత్వం తెలిసినవాళ్ళు మహాభారతాన్ని ధర్మశాస్త్రం అన్నారు. వేదాంతవేత్తలు వేదాంతం అన్నారు. కవులు కావ్యం అన్నారు. లాక్షిణికలు లక్షణశాస్త్రం అన్నారు. చరిత్రకారులు ఇతిహాసం అన్నారు. పౌరాణికులు పురాణం అన్నారు.ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తికపర్వం, స్త్రీపర్వం, శాంతిపర్వం, అనుశాసనికపర్వం, అశ్వమేథపర్వం, ఆశ్రమాసపర్వం, మౌసలపర్వం, మహాప్రస్థానపర్వం, స్వర్గారోహణపర్వం...ఈ పద్దెనిమిదీ మహాభారతపర్వాలు.ఈ పర్వాలను ప్రచారం చేసేందుకు నారదుణ్ణి దేవలోకంపంపాడు వ్యాసుడు. దేవలుణ్ణి పితృలోకానికి పంపాడు. శుకుణ్ణి గరుడ, గంధర్వ, యక్ష, రాక్షసలోకాలకు పంపాడు. సుమంతుణ్ణి నాగలోకానికి పంపాడు. నరలోకానికి వైశంపాయనుణ్ణి పంపాడు. ఆ వైశంపాయనుడు ఈకథను జనమేజయునికి చెబుతోంటే నేను విన్నాను. ఆ విన్నది మీకు చెబుతున్నాను అన్నాడు సూతుడు.కృతయుగం చివర దేవాసురయుద్ధంలా, త్రేతాయుగాంతంలో రామరావణయుద్ధంలా, ద్వాపరయుగంచివరలో కురుపాండవయుద్ధం జరిగింది. ఈయుద్ధంలో ఏడు అక్షోణీలసేనసహా పాండవులు పాల్గొంటే, పదకొండు అక్షోణీలసేనసహా కౌరవులు పాల్గొన్నారు. శమంతకపంచకంలో ఈయుద్ధం జరిగింది. పద్దెనిమిదిరోజులపాటు జరిగింది. యుద్ధం జరుగుతున్న ఈ పద్దెనిమిదిరోజులూ భూమండలం వణకిపోయింది.మనసుపెట్టి శ్రద్ధగా ఈ మహాభారతాన్ని వింటే చాలు, నాలుగువేదాలూ, పద్దెనిమిది ధర్మశాస్త్రాలూ, పద్దెనిమిదిపురాణాలూ, మోక్షశాస్త్రరహాస్యాలన్నీ తెలిసినట్టే అన్నాడు సూతుడు.అయితే మహాభారతమే వింటాం. వివరంగా చెప్పు అన్నారు మునులంతా.అన్నట్టు శమంతకపంచకం అంటే ఏమిటి? అక్షోణీ అంటే ఏమిటి? అని అడిగారు.

ఇది త్రేతా ద్వాపరయుగాలసంధినాటిమాట! పరశురాముడు క్షత్రియుల మీద ఆగ్రహించాడు. వారిపై ఇరవై ఒక్కమార్లు దండయాత్ర చేశాడు. క్షత్రియుడు అన్నవాడినల్లా గండ్రగొడ్డలితో నరికిపారేశాడు. వారి రక్తంతో అయిదుమడుగులు చేశాడు. ఆ రక్తంతో పితృతర్పణం చేశాడు. అప్పుడు ఆయనకోపం శమించింది. ఆ ప్రదేశమే శమంతకపంచకం. అదే కురుక్షేత్రం. ఇక అక్షోణీ అంటే...ఇరవై ఒక్కవేల ఎనిమిదివందల డెబ్బయి రథాలూ, అన్ని ఏనుగులూ, అరవై అయిదువేలా ఆరువందలపది గుర్రాలూ, లక్షా తొమ్మిదివేల మూడువందలయాభైమంది భటులూ గల సైన్యాన్ని అక్షోణీ అంటారు. ఇలాంటి పద్దెనిమిది అక్షోణీలసైన్యం, పద్దెనిమిదిరోజులపాటు కురుక్షేత్రంలో హోరాహోరీ పోరాడింది.