మండే అగ్నిజ్వాల
 
 
‘‘ఒక అందమైన పోయెం అంటే / దానికి ఒక గుండె ఉండాలి / అది కన్నీళ్ళు కార్చాలి / క్రోధాగ్నులు పుక్కిలించాలి / పీడితుల పక్షం అవలంబించాలి / మనిషి రుణం తీర్చుకోవాలి’’

అని చెప్పే శేషేంద్ర ఆధునిక మహాభారతం సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ సౌజన్యంతో మరోసారి మనముందుకు వచ్చింది.

’వాళ్ళు నల్లగా ఉంటే ఏం! వాళ్ళు బంగారు కిరణాల్లో నివసించే వాళ్లు. వాళ్ళ నడినెత్తిన ఉన్న సూర్యుడే వాళ్ళ ఉజ్జ్వల కిరీటం ....’ అని ఎండ కొంగు పట్టుకుని నడుస్తున్న వారికి తన అక్షర జ్యోతులతో హారతి పట్టిన కవి శేషేంద్ర. ’జీవితం దున్నే నాగటి చాళ్ళుగా ముఖంలో ముడతలు శోభించే మనిషిని నేను’ అని ప్రకటించుకున్న శేషేంద్ర కవిత్వం నిండా ప్రజల పలవరింపే ఉంటుంది. 

శేషేంద్ర శర్మ రాసిన వచన కవితా సంకలనాల సమాహారమే ఈ ‘ఆధునిక మహాభారతం’. పండితులు దీన్ని ఒక ‘మహా కావ్యేతిహాసం’గా  పరిగణిస్తారు. మొత్తం పది పర్వాలలో 1970, 1980 దశకాలనాటి భారతదేశాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు ప్రతి మనిషిలోని మనీషిని తట్టి లేపుతుంది. పాఠకుల హృదయాలకు గురి చేసి ఆయన వదిలే అక్షర బాణాలకు నొచ్చుకోవాలా? మెచ్చుకోవాలా? అన్నది ఎవరికి వారు తేల్చుకోవల్సిందే. ఎందుకంటే ఆయన ‘‘చేయి ఎత్తితే అది మండే అగ్ని జ్వాల. దించితే వెయ్యి కిరణాలు వ్రేలాడే సాయం సంధ్య’’. 

- రామినేని శ్రీకృష్ణప్రసాద్‌
ఆధునిక మహాభారతం, శేషేంద్ర శర్మ
పేజీలు : 400, వెల : రూ.400 
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు