ప్రస్తుతం తెలుగులో హాస్య, వ్యంగ్య రచనలు చేస్తున్న అతి కొద్దిమందిలో యాసీన్ ఒకరు. యాసిన పెన్ను పడితే ఫన్నులు జాలువారుతాయి. ‘హాహాకారాలు’ పేరుతో ఆయన తీసుకొచ్చిన ఈ పుస్తకం నిండా సెటైర్లే. వాటిని బుజ్జిగాడి కథలు, రాంబాబు కథలు, నా కథలు, బావ కథలు, జంతు కథలు, కొసరు కథలు .. ఇలా విడగొట్టి మరీ వ్యంగ్యాన్ని పండించారు.
 
మొదట్లో తన కొడుకు సెంట్రిక్‌గా రాసిన కథలు మహా నవ్విస్తాయి. ‘కాకి కిడ్డు కాకికి కిస్సు’ (కాకిపిల్ల కాకికి ముద్దు) అని కదా సామెత. పిల్లల అల్లరి ముద్దుగానే ఉంటుంది. ఒకమేర శృతి మించినా ఓర్చుకుంటాం. ఎందుకంటే కన్నూ మనదే వేలూ మనదే. ఇంటికి తెచ్చుకున్న ఎల్‌సిడి టి.వి.ని పిల్లోడు కత్తితో చీరేస్తే ... మా కొత్త ఎల్‌సిడి టి.వి. బలాన్ని వాడు కత్తి మొనతో పరీక్షించాడు, ఈ పరీక్షలో కత్తికి ఏమీ కాలేదన్న బాధ వాడి కళ్లలో కనిపించిందంటాడు. వాడు డిజిటల్‌ గడియారాన్ని ముళ్ల గడియారానికి వేసి గుద్దినపుడు రెండూ పగిలినా అందులో ఒకటి వెనక్కి తిరగడం మొదలుపెట్టిందట. కాలాన్ని వెనక్కి తిప్పడం దేవుడికే సాధ్యం కాకపోయినా కొడుక్కి సాధ్యమైందంటూ మురిసిపోతాడు.
 
పేర్లలో ఏముందన్న షేక్‌స్పియర్‌కే సవాలు విసురుతాడు ఈ బుడతడు. నేములోనే అన్నీ ఉన్నాయంటాడు వీడు. అందుకే అంకాలజీ అయినా చింపాలజీ అయినా జనానికి అర్థం కావాలంటాడు. ఇకపై కళ్ల డాక్టర్‌ని ఆప్తల్మాలజిస్టు అని కాకుండా ‘విజనిస్టు’ అని, పీడియాట్రిషనను ‘కిడ్స్‌ స్పెషలిస్టు’ అని పిలవాలంటాడు. సెన్సు, సైన్సు, సోషల్‌ సైన్సును పేకమేడల్లా అల్లేసి పాఠకులను గిరగిరా తిప్పేస్తాడు. పిల్లికి గడ్డం ఉండనపుడు పిల్లిగడ్డం అంటారెందుకో అంటూ గడుసుగా అడిగేస్తాడు.
 
రాంబాబు కథల్లో మరీ కొత్త కొత్త విషయాలని డిస్కవరీ చేస్తాడు రచయిత. కోడి తలపై ఉండే పగడపు తురాయిని చూపి తొలి కమ్యూనిస్టు కోడి అంటూ జీవశాస్త్రాన్ని సామాన్యశాస్త్రంతో కలిపి కొత్త సిద్ధ్దాంతాన్ని ఆవిష్కరిస్తారు యాసీన. లోకంలో కష్టపడేది ఒకరైతే క్రెడిట్‌ కొట్టేది మరొకరైనట్లు పలానా హోటల్‌లో ఇడ్లీ బాగుందంటారు కానీ ఒక్కడూ చెట్నీ గురించి మాట్లాడడు. చెట్నీ లేకుంటే ఒక్క ముక్క దిగదు - అయినా క్రెడిటంతా ఇడ్లీకే. క్రికెట్‌లో చచ్చి చెడి ఒకడు క్యాచ పడితే ఘనతంతా బౌలర్‌కి ఇచ్చి కిరీటం పెడతారంటూ చెట్నీస్‌ అండ్‌ చెనక్కాయ్‌ థియరీలో పల్లీలు దంచి మరీ చెబుతారు. ఇలా యాసీన్‌ నవ్వులపువ్వుల ఒక పెద్దహాస్య, వ్యంగ్య గుచ్ఛాన్ని పాఠకులకు అందించారు.
 
- గోవర్ధనం కిరణ్‌కుమార్‌ 
హాహాకారాలు, యాసీన 
పేజీలు : 206, వెల : 160, 
ప్రతులకు : 99121 99423,
ప్రముఖ పుస్తక కేంద్రాలు