మంచి కథల ‘దిబ్బ’
బహుశా రావిశాస్త్రి రచనల తర్వాత ఉత్తరాంధ్ర సామాజిక వాస్తవికతను శక్తివంతంగా మిగతా ప్రాంత ప్రజలకు ప్రసారం చేయగలిగిన కథలు చింతకింది శ్రీనివాసరావు రాసిన ‘కాన్పులదిబ్బ’ కథలేనేమో! బలవంతంగా పేజీలు తిరగేయాల్సిన అవసరం లేకుండా ఈ పది కథలూ మనల్ని ఒక్క ఉదుటున చదివిస్తాయి. ఉత్తరాంధ్ర మాండలికాలకు సహజంగానే కథాగమనాన్ని వేగంగా కొనసాగించే శక్తి ఉంది. రావిశాస్త్రి మీదుగా పతంజలి దాకా నడిచిన ఒక సాహిత్య ధోరణిని చాలాకాలం తర్వాత ఈ కథలు మరింత ముందుకు తీసుకెళ్ళాయి. కథల్లో కథను వెతుక్కోవాల్సిన ఈ కాలంలో, కథలు మనుషులు భరించలేని సందేశాలతో నిండిపోయిన రోజుల్లో ఈ కథలొక రిలీఫ్‌. 
ఉత్తరాంధ్ర సామాజిక జీవనాన్ని మార్మికంగా వివరించే ఈ కథల్లోని పాత్రలు, సంఘటనలూ చాలాకాలం పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సామూహిక అస్తిత్వ వాస్తవికతలోని అసాధారణాంశాలనూ డొల్లతనాన్నీ, అబ్సర్డిటీనీ పట్టిస్తాయి. తెలుగు కథ తన సహజసిద్ధమైన సున్నిత సంవేదనలనూ, లక్షణాలనూ కోల్పోతూ పాఠకులకు విరక్తి కలిగేలా సిద్ధాంతీకరించబడుతున్న ఈ రోజుల్లో ‘కాన్పులదిబ్బ’ కథల్లోని పాత్రలు మనలో ఆసక్తిని చిగురింపజేస్తాయి.
   - లెనిన్‌ ధనిశెట్టి
కాన్పులదిబ్బ, చింతకింది శ్రీనివాసరావు
పేజీలు : 124, వెల : రూ.110
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు, www.kinige.com