‘ఎవరో చచ్చిన ఆవును/ మోసుకు పోతున్నారు/ దాని తోక/ నేల మీద ఎలిజీ రాస్తోం’దన్నారు ప్రముఖ కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌ చాలా దశాబ్దాల క్రితం. కానీ, ఇప్పుడు ఆవును మోసుకుపోవాల్సిన వారి శరీరాలే ఈ లౌకికవాద రాజ్యంపై నెత్తుటి ఎలీజీలు రాస్తున్నాయి. తమ అవసరాల కోసం, ఓట్ల రాజకీయాల కోసం బలవంతంగా దేశద్రోహి అంటూ పుట్టుమచ్చ వేసినవారే, ఇప్పుడు వారిని నెత్తుటి ముద్దలుగా మారుస్తున్నారు. పాతికేళ్ళు గడిచిపోయాయి. అద్వానీ రథయాత్ర నుంచి బాబ్రీ మసీదు విధ్వంసం వరకు ముస్లిం సమాజానికి అండగా నిలిచిన అభ్యుదయ, ఆదర్శ వర్గాలన్నీ ఓటమిపాలయ్యాయని చెప్పలేం గానీ- సాధించాలనుకున్న లక్ష్యానికి చేరువకాలేకపోయాయి. అందుకే ‘ఆచరణతో ప్రమేయం లేని/ అక్షరాల లౌకిక భావనకి/ అన్యాయమైపోయింది ఎవరో కాదు నేనే’ అంటారు ఖాదర్‌. పాతికేళ్ళ ఆవేదన, ఆగ్రహంగా మారుతున్న తరుణంలో తన షష్టిపూర్తి సందర్భంగా ‘పుట్టుమచ్చ’ను స్వయంగా పునర్ముద్రించుకున్నారు ఖాదర్‌. 
- దేరా 

పుట్టుమచ్చ, ఖాదర్‌ మొహియుద్దీన్‌ 
పేజీలు : 71, వెల : రూ.100 
ప్రతులకు : 94906 34849