కవి, కథకుడు, రంగస్థల నటుడు, జర్నలిస్టు వెరశి సాహిత్య తపస్వి డా.త్యాగదుర్గం మునస్వామి. సాహిత్యలోకంలో మౌని గా ప్రసిద్ధులు. విస్తారమైన సాహిత్య జీవితం చూసిన మౌని తొలుత కవిగా లబ్ధప్రతిష్ఠులు. పాతిక గ్రంథాలు, కవితా సంపుటిలు, ఎన్నో పురస్కారాలు ఆయన కెరీర్‌లో ఉన్నాయి. చిత్తూరుజిల్లా సువర్ణముఖి నది ఒడ్డునవున్న పల్లెలు, ఆ పల్లె ప్రజల ఆప్యాయతానుబంధాలే ఈ ‘కొత్త పొద్దు’ కథలు. చిత్తూరుజిల్లా చిత్రపటాన్ని పాఠకుల ముందు నిలబెట్టిన కథలివి. 

టైటిల్‌ కథ ‘కొత్త పొద్దు’ గ్రామీణ పెత్తందారీ సంకెళ్ళు తెంచుకుని వలసబాటపట్టే కులవృత్తుల జీవితాల్ని ఆవిష్కరిస్తుంది. పట్నం మోజు, సంపాదన వేటలో పడి ఆచరణలో అథఃపాతాళానికి చేరిన ఒక యువకుడి కథ ‘చిగురించిన మోడు’. అదేవిధంగా గుండెతడి, దేవుడిమాను, కొండచుట్టరికం, గడ్డపెరుగు లాంటి ఈ సంపుటిలోని 41 కథలూ మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయి.

కొత్త పొద్దు

మౌని కథలు
ధర 300 రూపాయలు
పేజీలు 272
ప్రతులకు విశాలాంధ్ర అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు, నవోదయ పుస్తక విక్రయ కేంద్రం, హైదరాబాద్‌ మరియు రచయిత, ఎల్‌.ఎస్‌.నగర్‌, తిరుపతి–02 సెల్‌ 8074631328