అపురూప వ్యక్తిత్వం 

ప్రముఖ పారిశ్రామికవేత్త, కృష్ణపట్నం ఓడరేవు చైర్మన చింతా విశ్వేశ్వరరావు (సి.వి.ఆర్‌) జీవిత 
విశేషాల సంకలనం ఈ ‘సీవీఆర్‌ జీవన తరంగాలు.’ అతి సాధారణ కుటుంబంలో పుట్టి, స్వయంకృషితో ఓ పారిశ్రామికవేత్తగా ఎదిగి, నిస్వార్థంగా పది మందికీ సహాయంగా ఉంటూ, నిరాడంబరంగా జీవిస్తున్న ఓ వ్యక్తి విజయ ప్రస్థానం తప్పక తెలుసుకోవాల్సిన విషయమే. సీవీఆర్‌ జీవిత విశేషాలను అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో ఆవిష్కరించిన సి.వెంకటకృష్ణ, సహ రచయిత డాక్టర్‌ కె.బాబూరావు ఎక్కడా అనవసర విశేషణాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు అందించారు. సీవీఆర్‌కి సంబంధించి గతంలో ‘విశిష్ట వ్యక్తిత్వం’ అనే గ్రంథం వెలువడింది. దాని కొనసాగింపుగా ఈ ‘జీవన తరంగాలు’ ప్రచురించారు. ఆయనలోని నిఖార్సయిన వ్యక్తిత్వం, పట్టుదల, నిర్ణయాత్మక శక్తి, అచంచల ఆత్మవిశ్వాసం తదితర లక్షణాలు ఈ పుస్తకంలో చక్కగా అభివ్యక్తమయ్యాయి. 
పారిశ్రామికవేత్త స్థాయికి ఎదిగిన సీవీఆర్‌ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను, కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. వీటన్నిటికీ ఎదురీది, వ్యయప్రయాసలకు ఓర్చి తన పారిశ్రామిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఎందరికో ఉపాధి కల్పించిన సీవీఆర్‌ మరెందరికో అండా దండా అయ్యారు. ఆయన జీవిత విశేషాలు నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఇవి యువత సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడడమే కాకుండా, ఎందరో ఔత్సాహిక వ్యవస్థాపకులకు మార్గదర్శకంగా కూడా నిలుస్తాయి. 
- జి. రాజశుక 


సి.వి.ఆర్‌ జీవన తరంగాలు 
రచయిత: సి. వెంకటకృష్ణ 
సహ రచయిత: 
డాక్టర్‌ కె.బాబూరావు 
పేజీలు : 118, 
వెల: రూ. 150 
ప్రతులకు: కోట్‌లక్‌ బుక్స్‌ 
ఫోన: 040-23306789, 
98490 66789