ప్రపంచం ఒక పుస్తకరూపంలో! 

ఆదినారాయణ జగమెరిగిన యాత్రికుడు. ప్రయాణించడమే జీవితమని నమ్మినవాడు. ఆయన పద్నాలుగు దేశాల ప్రయాణానుభవాలే ఈ పుస్తకం. ట్రావెలాగ్‌ అంటే చాలామంది ఆయా దేశాల వింతలు, విడ్డూరాలు, కట్టడాల గురించి వివరిస్తుంటారు. అయితే అవన్నీ మనకు ఇంటర్‌నెట్‌లో కూడా దొరుకుతాయి. కానీ ఆయా దేశాల్లో ఉండే వ్యక్తులు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవి గూగుల్‌ సెర్చ్‌లో దొరకవు. ఆదినారాయణ ప్రత్యేకత ఇదే. ఆయా దేశాల పరిచయం కంటే అక్కడి మనుషులతో ఉండే అనుబంధాన్నే ఎక్కువ వివరిస్తారు. 
నైజీరియా గురించి మనకు తెలుసు. కానీ పాట కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఫేలాకూటి గురించి తెలియదు. మిలట్రీ పాలకులు తల్లిని హత్య చేస్తే, ఆమె శవాన్ని మిలట్రీ కార్యాలయం ముందు ఉంచి పాటతో నిరసన తెలిపిన మహాగాయకుడు. ఇలా కొత్త ప్రపంచాన్ని మనకి ఆదినారాయణ పరిచయం చేస్తారు. స్వతహాగా సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని ఇష్టపడతారు కాబట్టి ఈ పుస్తకంలో ఎక్కువమంది సంగీతకారులు, ఆర్టిస్ట్‌లు మనకు పరిచయం అవుతూ ఉంటారు. 
ఉన్న చోటే ఉండిపోతే మనిషికి నాగరికతే లేదు. ప్రయాణమే మనిషి జీవనగతిని మార్చేది. నిరంతర యాత్రికుడు ఆదినారాయణ ఈ పుస్తకం ద్వారా మనం చూడని ప్రపంచాన్ని చూపించారు. ప్రయాణాల్ని ఇష్టపడేవాళ్లంతా చదవాల్సిన పుస్తకం ఇది. 
- జి.ఆర్‌.మహర్షి 

భూభ్రమణ కాంక్ష - ఎం. ఆదినారాయణ 
పేజీలు : 385, వెల : రూ.250 
ప్రతులకు : 98498 83570