సాహితీ దిగ్గజం జీవీకే 

జీవీకేగా సాహిత్యాభిమానులు పిలుచుకునే గవిని వెంకట కృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. మార్క్సిస్టు దృక్పథ విమర్శకులు. కేవలం బీఏ పట్టాతోనే పింగళి సూరన కళాపూర్ణోదయం మీద ఆంగ్లంలో పీహెచ్‌డీ గ్రంథం సమర్పించి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. ఇప్పటివరకూ మరెవరికీ బీఏ పట్టా మీద డాక్టరేట్‌ రాలేదంటే జీవీకే ఘనత ఏమిటో అర్థమవుతుంది. జీవీకే శత జయంతి (2015) సందర్భంగా ఆయన అభిమానులు, శిష్యులు కలిసి ఈ ప్రత్యేక సంస్మరణ సంచికను వెలువరించారు. జీవీకే సన్నిహితులు, శిష్యులతో పాటు ప్రముఖ రచయితలు రాసిన వ్యాసాలు ఈ సంచికలో ఉన్నాయి. ఆయన జీవిత విశేషాలతో పాటు సాహితీకారుడిగా, విమర్శకుడిగా, తాత్వికుడిగా ఆయన తన భావ జాలాన్ని ఏ విధంగా ప్రచారం చేశారో ఈ వ్యాసాల్లో వివరంగా చర్చించారు. జీవీకే రచించిన ‘జఘనసుందరి’ ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ సిద్ధాంతం నేపథ్యంగా సాగుతూ మానవ ప్రవర్తనలోని వైరుధ్యాలను, సంఘర్షణనూ చిత్రించిన నవల. ఈ నవల విశిష్టతను మరో వ్యాసంలో చర్చించారు. భవిష్యత్తులో వారి రచనా సర్వస్వాన్ని కూడా తీసుకువస్తే బాగుంటుంది. 

- చందు

 
 డా. జీవీకే శతజయంతి సంస్మరణ సంచిక 
పేజీలు : 390, వెల : రూ.500 
ప్రతులకు : వెలగా మానవేంద్ర, 92905 38006