రంగుల రుతువు
 
రుతువులన్నీ ఒక్క రంగులో ఉండవు. పోనీ, ఒక్కో రుతువుకూ ఒక్కో రంగూ ఉండదు. ఒక్క రుతువులోనే ఎన్నెన్నో రంగుల విచిత్ర విన్యాసం కొనసాగుతూంటుంది. ఆ రంగుల విన్యాసాన్ని చూడగలిగేవారు కెక్యూబ్‌ వర్మ ‘కాగుతున్న రుతువు’లోని కవిత్వాన్ని ఆస్వాదించగలుగుతారు. ‘వెలగని వీధి దీపం చుట్టూ / ఓ రెక్క తెగిన మిణుగురు’ విలాపాన్ని అక్షరాల్లో బంధించి అతి రహస్యంగా అందరికీ వినిపిస్తున్నాడు. ‘నువ్వలా జ్వరం వాసనేస్తూ/ ముడుచుకున్నప్పుడు/ ఒక వేడి అన్నం ముద్దలా’ పలకరిస్తాడు. ‘గాయమైన స్వప్న శకలాలకు వెదురుపూలు/ రెక్కలు అతుకుతూ’ కనిపిస్తాడు. విప్లవ కవిత్వమంటే ఇలాగే ఉండాలనే వారికీ, ఇలాగే ఉంటుందని అనుకునేవారికీ వర్మ కవిత్వం ఒక విరుగుడు. ‘అసంపూర్ణత్వమేదో కుంచె చివర/ వర్ణాల వెనకాల విరిగిపోతూ..’ అంటూ రుతువులోని రంగుల రహస్యాన్ని సున్నితంగా విప్పడంలో వర్మ పరిణతి సాధించాడు.
- దేరా
కాగుతున్న రుతువు, కెక్యూబ్‌ వర్మ
పేజీలు : 174, వెల : రూ. 80
ప్రతులకు : 94934 36277, ప్రముఖ పుస్తక కేంద్రాలు