శ్రామిక సంస్కృతి ఆనవాళ్లు
 
 
రామాయణమంత సుదీర్ఘ చరిత్ర ఉన్న రజక కులాల తరతరాల పరాధీనతనూ, నిస్సహాయ, నిర్బంధ బానిసత్వాన్నీ కథల రూపంలో ఉంచిన మొట్టమొదటి కథా సంపుటి వింజమూరి మస్తాన్‌బాబు రాసిన ‘మడేలుమిట్ట కథలు’. ఆ కులానికి చెందిన సమూహ మానసిక స్థితిగతులనూ సుఖ దుఃఖాలనూ, ఆనంద విషాదాలనూ తెలుగు సాహిత్యంలో వ్యక్తీకరించేందుకు నూరేళ్ళకు పైగా కాలం పట్టడం విచిత్రం. ప్రాంతాల పేరుతో వచ్చిన చాలా కథా సంపుటాల్లాగా ఇందులోని కథలు దుఃఖాన్ని నటించవు, అసందర్భాలను అరువు తెచ్చుకోవు, కథా వస్తువులోని స్వచ్ఛత/అమాయకత్వం రచనను ప్రాణదీపమై వెలిగించి మనల్ని కడకంటా చదివిస్తాయి. కొండొకచో కదిలిస్తాయి. ఈ సంపుటిలోని ‘వండని కూడు’ కథ రజక కుల పురాణాన్ని వివరిస్తుంది. ఈ కథతో పాటూ, గరిశెలో దెయ్యం, గర్భశివలింగం, మంచుకాలం, పరవ వంటి కథలు ఆ వృత్తిలోని శ్రమైక జీవన సౌందర్య విషాదాన్ని నిరాడంబరంగా అర్థం చేయిస్తాయి. నిజానికి ఇవి కథల రూపంలోని ఒక తరఫు చారిత్రక గాథలు. బాబులు అనే రజక కుర్రాడి జ్ఞాపకాలలో మేలుకొన్న ఆ కుల ఐతిహ్యాలు. తరతరాల రజక కుల శ్రామిక సంస్కృతికి ఆనవాళ్ళు. స్థానికతను కల్తీ లేకుండా అచ్చ నెల్లూరి గ్రామీణపదాల్లో, పలుకుబడితో పరిమళించే ఈ సంపుటిలోని ఇరవైమూడు కథలు చార్వాక కళాపీఠం రాచపాళెం రఘు ఆర్థిక సహాయంతో పుస్తక రూపం దాల్చడం విశేషం.
 
మడేలుమిట్ట కతలు
వింజమూరి మస్తాన్‌బాబు
పేజీలు : 160,
వెల : రూ. 50
ప్రతులకు : 
94919 20429,
ప్రముఖ పుస్తక కేంద్రాలు