పాడుకున్నోళ్లకు పాడుకున్నన్ని!
 
తెలుగువారికి అచ్చొచ్చిన సంఖ్య వెయ్యినూట పదహార్లు! ఇన్ని సినిమా పాటలు ఒకే దగ్గర కనిపిస్తే సంగీత ప్రియులు ఎగిరి గంతేయరూ! ఈ బృహత్తర పాటల పుస్తకాన్ని మనముందుకు తెచ్చినవారు రాజమండ్రికి చెందిన గొల్లపూడి వీరాస్వామి సన్‌ పబ్లిషర్లు. పుస్తకం చూడగానే చాలా రిచ్‌గా పకడ్బందీగా ‘అబ్బో’ అనిపిస్తుంది. కూర్చిన పాటలన్నీ మధుర గీతాలు కాదనే విషయం సంకలనకర్తకూ తెలుసు కాబట్టే లోకో భిన్న రుచి అంటూ ముందుమాటలోనే సెలవిచ్చారు. ఇంత పెద్ద పుస్తకాన్ని తీసుకువచ్చేప్పుడు అరకొర అచ్చుతప్పులు దొర్లడం సహజమే కాని రచయితల పేర్లతో పాటు సినిమా పేర్లు, సంగీత దర్శకుల పేర్లు సైతం మారిపోవడం శోచనీయం. ‘బొమ్మను చేసి ప్రాణము పోసి’ (దేవత) పాట రాసింది శ్రీశ్రీ అయితే అచ్చులో వేటూరి అని ఉంది. ‘ఒక దీపం వెలిగింది, ఒక రూపం వెలిసింది’ పాట ‘ఏకవీర’ చిత్రంలోని దైతే ‘ఉమ్మడి కుటుంబం’ అని ఉంది. ‘కళ్లలో పెళ్లి పందిరి కనపడసాగే’ (ఆత్మీయులు) పాట రాసింది శ్రీశ్రీ అయితే సినారె అని ఉంది. ‘విచిత్ర కుటుంబం’ చిత్రానికి సంగీత దర్శకులు టి.వి.రాజు. కాని, అచ్చులో కె.వి.మహదేవన్‌ అని ఉంది. ఇక అక్షరాలు మిస్సవడమనేది చాలాచోట్ల కనిపించింది. ఉదాహరణకు ‘కలయిదని... నిజమి దనీ’ (దేవదాసు - పేజీ నెం 93) చూడొచ్చు. ఈ బృహత్కార్యానికి నడుం బిగించినప్పుడు హిమాలయాలంత ఓపిక కూడా ఉండాలి. లేకపోతే అనుకున్నది అనుకున్నట్టు రాదు. ఏదేమైనా ఇదొక మంచి ప్రయత్నం - అభినందనీయం.
- గొరుసు
 
1116 మధుర సినీ గీతాలు
సంకలనం : జయంతి చక్రవర్తి
పేజీలు : 1280,వెల : రూ.450
ప్రతులకు : 93905 26272