తరతరాల చేనేత వెతలు

దాదాపు అటూ ఇటూ వందేళ్ల కాలంలో తెలుగు సమాజంలోని చేనేత కుల వృత్తికారుల జీవన నేపథ్యంగా రాసిన యాభై ఎనిమిది కథలను ‘పడుగుపేకలు’ పేరుతో సంకలనంగా వెలువరించింది ఫోరమ్‌ ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌. చేనేత జీవితాలలో నుంచి తెలుగు కథను వెతికి పట్టి చూపించిన మొట్టమొదటి వృత్తి అస్తిత్వ కథాసంపుటి ఇది. తెలుగులోనే కాదు భారత సమాజంలో కీలకమైన నేత పనికి సంబంధించిన సాహిత్య వ్యక్తీకరణ ఎంత అల్పస్థితిలో ఉందో ఈ సంపుటి చెప్పకనే చెబుతుంది. చేనేత వృత్తి మనదేశంలో పుట్టింది మొదలు ఆ వృత్తిదారుల జీవితాల్లోని దోపిడీనీ, పీడననూ, దారుణమైన పరాధీనతనూ, విధ్వంసాన్నీ వివిధ కోణాల్లో వ్యక్తం చేశాయి ఈ కథలు. అదే సమయంలో ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యతనూ గుర్తు చేస్తాయి. తెలుగు సమాజాన్ని వృత్తిజీవితాల పట్ల సెన్సిటైజ్‌ చేయడంలో భాగంగా ప్రచురించిన ఈ సంపుటి ఆ మేరకు తన బాధ్యతను నెరవేర్చింది. చేనేత వృత్తి ఉత్థాన పతనాలను వివరంగా తెలిపే సంగిశెట్టి శ్రీనివాస్‌ పరిచయ వ్యాసం ఇన్ఫర్మేటివ్‌గా ఉండడమే కాదు, తక్కువ పేజీల్లో విస్తారమైన విషయాలను తెలియజేస్తుంది. వృత్తికథల మీద పరిశోధనలు చేసేవారికి ఈ పుస్తకం రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. మేడికుర్తి ఓబులేసు, వెల్దండి శ్రీధర్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ ఈ సంపుటి సంపాదకులు.

పడుగుపేకలు (చేనేత కథలు)
పేజీలు : 568, వెల : రూ.300
ప్రతులకు : 98492 20321, ప్రముఖ పుస్తక కేంద్రాలు