హాస్యానికి బండగుర్తులు!
 
శంకర నారాయణ మహా సీరియస్‌ మనిషి. కాబట్టే, హాస్యాన్ని కూడా సీరియస్‌గా తీసుకున్నారు. హాస్యానికో అవధాన ప్రతిపత్తి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఉత్పల-చంపకమాలల పక్కన చాపేసి కూర్చోబెట్టారు, సహస్రావధానుల ముందు సగర్వంగా నిలబెట్టారు. బెల్లం పాకంలో అద్దాకే చక్రాలు జిలేబీలు అయినట్టు... జీవితం పట్ల ఎంతోకొంత సానుకూల దృక్పథమూ, కాస్తోకూస్తో హాస్యస్పృహా ఉన్నవారి విషయంలో మాత్రమే మామూలు గుర్తులు ‘తీపి గుర్తులు’ అవుతాయి. ఆ రెండు సుగుణాలూ హాస్యబ్రహ్మ శంకరనారాయణకు పుట్టుకతోనే అబ్బిన విషయం ఈ పుస్తకాన్ని చదివితే అర్థం అవుతుంది. అనుభవాల్లోంచీ, జ్ఞాపకాల్లోంచీ, సంభాషణల్లోంచీ, అక్కడక్కడా కష్టాల్లోంచీ హాస్యాన్ని పుట్టించారు రచయిత. ‘తీపి గుర్తులు’లో నవ్వించే హాస్యమే కాదు, ఎలా నవ్వును సృష్టించుకోవచ్చో నేర్పించే సూత్రమూ ఉంది. ఆ కిటుకు కనుక ఒంటబట్టించుకుంటే, ఎవరి జీవితానికి వారు హాస్యావధానే! శంకరనారాయణ లాగానే, అమెరికా వీసా అలవోకగా సంపాదించుకోవచ్చు. అప్పూ డప్పూ లేకుండానే జీవితంలో పైకి రావచ్చు. ఎప్పుడైనా ఆత్మకథ లాంటిది రాసుకుంటే, రెండొందల పేజీల పుస్తకంలో యాభై పేజీల్ని సత్కార పురస్కారాల చిట్టాపద్దులకే కేటాయించుకోవచ్చు.
 
తీపిగుర్తులు , హాస్యబ్రహ్మ శంకరనారాయణ
పేజీలు: 200; వెల: రూ.150
ప్రతులకు: 80083 33227, ప్రముఖ పుస్తక కేంద్రాలు