‘పాలమూరు’కు పెద్ద పీట 

కర్నూలు జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌ (పాలమూరు)కు వచ్చి స్థిరపడ్డ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి సాహిత్యాన్నంతటినీ కలిపి ఇటీవల రెండు సంపుటాలుగా ప్రచురించారు. మొదటి సంపుటంలో కథలు, రెండవ సంపుటంలో కవితలు, వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ 1954-67 మధ్య రాసినవి. మహబూబ్‌నగర్‌ పట్ల ఎంతో అభిమానాన్ని పెంచుకున్న ఈ సాహితీవేత్త ఆ జిల్లా, పట్టణ సామాజిక పరిస్థితులనే ఇతివృత్తాలుగా చేసుకుని కథలు అల్లారు. పాలమూరు జిల్లాలో ఆయనంత ఎక్కువ స్థాయిలో కథా రచన చేసినవారు లేరంటే అతిశయోక్తి కాదు. రచనలో ఆయన ఊహలు, కల్పితాలకన్నా నిజ జీవిత విషయాలు, పరిణామాల వైపే ఎక్కువ మొగ్గు చూపారు. 
తెలుగు, హిందీ భాషలపైనే కాక, ఉర్దూ భాషపై కూడా పట్టు ఉండడంతో ఆయన రుబాయీలు, గజళ్లను కూడా రాశారు. రెండవ సంపుటం ‘వల్లపురెడ్డి మధుగీత’లో ఇవన్నీ ఉన్నాయి. ఉర్దూ కవిత్వాన్ని ఆస్వాదించే రసికులకు నచ్చిన అనేక ‘ముక్తకాల’ అనువాద సంపుటే ఈ ’మధుగీత’. ప్రతి ముక్తకం ఒక మినీ కవిత. ప్రతి కవితలోనూ మధువును పారించినందువల్ల ఆయన ఈ పుస్తకానికి మధుగీత అని పేరు పెట్టారు. ప్రతి ముక్తకంలోనూ ఓ ప్రణయ సందేశం కూడా అంతర్లీనంగా కనిపిస్తుంది. కథల్లోనే కాదు, ఆయన కవితలు, వ్యాసాల్లో సైతం వైవిధ్యం వ్యక్తమవుతుంది. అంతేకాదు అడుగడుగునా సామాజిక స్పృహ, దేశభక్తి, సామాన్య ప్రజల అభ్యున్నతి పట్ల ఒక విధమైన ఆరాటం బయటపడుతుంటుంది. కవితల కంటే కథలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. 
- జి. రాజశుక 

వల్లపురెడ్డి సాహిత్యం (రెండు సంపుటాలు) 
వల్లపురెడ్డి కథలు, వల్లపురెడ్డి మధుగీత, పేజీలు : , వెల : ఒక్కో సంపుటి: రూ.300 
ప్రతులకు: ఎస్‌.బి. కుసుమ్‌ కుమారి 94908 04157, అన్ని ప్రఽధాన పుస్తక కేంద్రాలు