సినీస్వర్ణయుగంలో  ఓ ఫిలిమ్‌ జర్నలిస్టు జ్ఞాపకాలు 

విశ్వసనీయతే సమాచారానికి ఊపిరి. వార్తకు విలువ, సమాజానికి చలువ చేకూరేదప్పుడే. అలాంటి విలువైన పత్రికలెన్నో కాలగర్భంలో కలిసిపోగా ఇప్పటికీ కొన్ని మిగిలేవున్నాయి. అలా అంతర్థానమైన సినీ మాసపత్రిక ‘విజయచిత్ర’. 

ఎలాంటి గాసిప్స్‌ లేకుండా సినిమారంగ విలువలు కాపాడిన ఆ పత్రికలో ఫిలిమ్‌ జర్నలిస్టుగా పేరొందిన వ్యక్తి బి.కె.ఈశ్వర్‌. రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (ఉత్తమ అనువాద గ్రంథం) గ్రహీత, సినీ కథ, మాటల రచయిత, కథానికా రచయిత కూడా. ఈనాటికీ పాతతరం విలువల్ని తన భుజంపై మోసుకెళుతున్న సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ ఈశ్వర్‌.
ప్రలోభాలకు లొంగని నైజం, నిబద్దత, అంకితభావం, జిజ్ఞాసతో ఉన్నతశిఖరాలు అధిరోహించారాయన. సినీ స్వర్ణయుగం నాటి మేటి నటులు, దర్శకులు, ఛాయాగ్రాహకుల మధ్య తిరిగి వారి వ్యక్తిత్వాలను ఇనుమడింపజేసే అసిధారావ్రతాల్లాంటి ఇంటర్వ్యూలతో మన్ననలు పొందారాయన. విజయచిత్రతో ఆయన అనుబంధం, ఆ జ్ఞాపకాల పందిరే ఈ పుస్తకం. నవ్య వీక్లీలో 62 వారాలపాటు ‘అనగనా ఒకసారి’ సీరియల్‌గా ప్రచురితమై విశేష పాఠకాదరణ పొందింది.
తన లాజిక్‌తో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అభిమానం చూరగొన్నారు ఈశ్వర్‌. గొప్ప నటుల నిరాడంబరత, కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడే భానుమతి, జయసుధ, రాధికలతత్వం, జయలలిత క్రమశిక్షణ, విలేకరిని తరిమి తరిమి కొట్టిన ధర్మేంద్ర యారగొన్సీ, అత్యధిక పారితోషికం తీసుకునే రజనీకాంత్‌ ఉదారత, కమల్‌హాసన్‌ నిరాడంబరత ఇందులో చదువుకోవచ్చు. 

అమెరికాలో మనవాళ్ళకి భద్రతలేదని దశాబ్దాలనాడే భానుమతి వ్యక్తం చేసిన ఆందోళన ఈ పుస్తకంలో చదివి అబ్బురపడతాం. లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న తొలి హాస్యనటుడు శివరావు దయనీయ మరణం, భార్య అస్తికల్ని స్టేజీవెనకాలపెట్టి డబ్బుకోసం నాటకం ప్రదర్శించిన పద్మనాభం విషాదం, రత్నకుమారి అనే నటి వాణిశ్రీగా ఎదగడానికి పడిన సంఘర్షణ, ఆమె పరిపక్వత, వ్యక్తిగత బలహీనతను నిర్భయంగా చెప్పిన నాగయ్య ఆదర్శం, ముగ్గురు ముఖ్యమంత్రులను ఆడించిన గొప్ప డాన్సర్‌ సలీం జైలుపాలైన విషాదగాథ, గొప్ప నటుల మద్యం అలవాట్లు, సెట్‌లో వారి తీరు, స్టింగ్‌ ఆపరేషన్‌లో లేడీ జర్నలిస్టుకు దొరికిపోయిన శక్తీకపూర్‌, స్టేజీమీద పక్కనే కూర్చున్న భర్త చలానికి శ్రద్ధాంజలి ఘటించిన  శారద భాషా వైపరీత్యం, ఘంటసాల రెండో జీవితం (సరళగారితో) ఇంకా గొప్ప నటులు, ప్రయోగాలు చేసే దర్శకులు, నాటి సినీ వైభవం ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్నాథశర్మగారు ముందుమాటలో పఝేర్కొన్నట్టు తెరవెనుక జీవితాల్లోని కథనమూ, కదనమూ రెంటినీ మనకళ్ళముందు ఆవిష్కరించిన పుస్తకమిది. సినీ ప్రియులు, సినీ జర్నలిస్టులూ తప్పకచదవాల్సినది.

-లలితా త్రిపుర సుందరి

 

విజయచిత్ర జ్ఞాపకాలు

బి.కె.ఈశ్వర్‌
ధర 175 రూపాయలు
పేజీలు 288 
ప్రచురణ విజయా పబ్లికేషన్స్‌, విజయాగార్డెన్స్‌, వడపళని, చెన్నై–26
ప్రతులకు సాహితి ప్రచురణలు, విజయవాడ