తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న చాలా మందిది ఒకప్పుడు మధ్యతరగతి నేపథ్యమే. అయితే ఎదిగిన తర్వాత తాము ఎక్కడినుంచి వచ్చామో చెప్పుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. గతం మరచిపోయినట్లు మాట్లాడుతుంటారు. చాలా కొద్దిమంది మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. మొహమాటం లేకుండా తమ గతం చెప్పుకుంటారు. వారిలో ముత్యాల సుబ్బయ్య ఒకరు. ఆయనతో మాట్లాడుతుంటే ఓ పెద్ద దర్శకునితో మాట్లాడుతున్నట్లు అనిపించదు. అన్నయ్యతోనో, బాబాయ్‌తోనో, మావయ్యతోనో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, గుర్తింపు పొందినప్పటికీ ఓ సగటు మనిషిలా మెలగడం, మాట్లాడటం ఆయనకే సాధ్యమైంది. పెద్ద, చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ‘గురువా’ అని స్వచ్ఛంగా పిలవడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. ‘గంగిగోవు పాలు గరిటడైనను చాలు..’ అన్నట్లు మూడున్నర దశాబ్దాల చలనచిత్ర జీవితంలో సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య తక్కువే అయినా అవన్నీ ఆయనలోని సామాజిక స్పృహకు నిదర్శనంగా నిలుస్తాయి. నెల్లూరుజిల్లాలోని ఓ మారుమూల పల్లె నుండి మద్రాసు, అక్కడి నుండి హైదరాబాద్‌కూ సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ముత్యాల సుబ్బయ్య ‘ఆంధ్రజ్యోతి సాహిత్యం’ పాఠకుల కోసం చెప్పిన విశేషాలు.

******************** 

మా స్వస్థలం ప్రకాశంజిల్లాలోని కె.బిట్రగుంట గ్రామం. నేను 1946 జూన్‌ 15న పుట్టాను. మా నాన్నపేరు శంకరయ్య, అమ్మ పేరు శేషమ్మ. ఇంటికి నేనే పెద్దకొడుకుని. మా నాన్నకు పదహారు రోజుల వయసులోనే వాళ్ల అమ్మ, నాన్న చనిపోవడంతో దూరపు బంధువైన ఓ పెద్దావిడ ఆయన్ని పెంచి పెద్ద చేసింది. ఆమె మరణంతో కె.బిట్రగుంటతో మాకు అనుబంధం తెగిపోయింది. కొద్దిపాటి పొలం నెల్లూరుజిల్లా పార్లపల్లిలో ఉండటంతో మా కుటుంబం ఆ గ్రామానికి ఫిఫ్ట్‌ అయింది. నాన్న టైలరింగ్‌ పని చేసేవారు. ఆదాయం అంతంత మాత్రమే. ఆ కొద్దిపాటి డబ్బుతో, పొలం నుంచి వచ్చే ఆదాయంతో అమ్మ గుట్టుగా సంసారం లాక్కొచ్చేది.ఐదో తరగతి వరకూ పార్లపల్లిలో చదివాను. ఆ తర్వాత పై చదువులు చదవాలంటే పక్కనే ఉన్న ఇడవలూరు గ్రామానికి వెళ్లాల్సిందే. అందుకే ఇడవలూరు హైస్కూల్‌లో ఆరో తరగతిలో చేరాను. పదో తరగతి వరకూ నా చదువు అక్కడే. మా ఊరుకీ, ఇడవలూరుకీ మధ్య రెండు కిలోమీటర్లు దూరం. అంతదూరం రోజూ నడకే. వయసు పెరిగిన తర్వాత మారాం చేయడంతో మా నాన్న నాకు సైకిల్‌ కొనిపెట్టారు.