జోస్యుడు

వాడో జోస్యుడు. బుద్ధి అన్నది లేదు వాడికి. బతకడానికి భార్యాబిడ్డలతో ఊరికాని ఊరికి వచ్చాడు. అక్కడ తానో జోస్యుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించేందుకు, డబ్బు సంపాదించేందుకు ఎత్తు వేశాడు. కన్న కొడుకుల్లో ఓ కొడుకుని పట్టుకుని నడివీధిలో ఏడవసాగాడు.‘‘ఎందుకేడుస్తున్నావయ్యా’’ అడిగారు జనం.‘‘నా బాధలు ఏం చెప్పమంటారు’’ అన్నాడు. తర్వాత ఇలా చెప్పుకొచ్చాడు.‘‘నా ఖర్మ కాలి నాకు భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలుసు! నేనో పెద్ద జోస్యుణ్ణి. వీడు నా కొడుకు. సరిగ్గా నేటికి తొమ్మిదవ రోజు వీడు చనిపోతాడు. వీడి గొంతు నులిమి ఎవరో చంపేస్తారు’’‘‘పాపం’’ జాలిపడ్డారు జనం. తొమ్మిదవ రోజొచ్చింది. ఇంకా తెలవార లేదు. చీకటి చీకటిగానే ఉంది. మెలకువ తెచ్చుకుని, నిద్రపోతున్న కొడుకుని చూశాడు జోస్యుడు. మంచినిద్రలో ఉన్నాడు వాడు. అదే అదనుగా కొడుకు గొంతు నులిమి చంపేశాడు జోస్యుడు. తెల్లారింది. ఏడుస్తోన్న జోస్యుణ్ణీ, చచ్చిపడున్న అతని కొడుకునీ చూసి జనం ఆశ్చర్యపోయారు. చెప్పినట్టుగానే జరిగిందంటూ జోస్యునికి చేతులెత్తి నమస్కరించారంతా. చాలా పెద్ద జోస్యుడితను. ఇందులో అనుమానం లేదనుకున్నారు. కొద్దిరోజులకి అతన్ని సత్కరించి నెత్తిన పెట్టుకుని, ఊరేగించారు. డబ్బు కోసం, పేరు కోసం మూర్ఖులు ఎలాంటి పనినయినా చేస్తారు.

గుర్తు

సముద్ర ప్రయాణం చేస్తున్నాడతను. ఓడలో నిల్చుని ఉండి, వెండిగిన్నెతో పాలు తాగుతున్నాడు. ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో జరిగిందది. అతని చేతిలోంచి జారిపడి వెండిగిన్నె సముద్రంలో పడిపోయింది. పడిన చోటును జాగ్రత్తగా గమనించాడతను. నీరు సుడులు తిరుగుతోందక్కడ. అలాగే బుడగలు కూడా చాలా ఉన్నాయి. గిన్నె ఇక్కడ పడిందయితే! తిరుగుప్రయాణంలో వచ్చి తీసుకుందామనుకున్నాడతను. ఈత వచ్చతనికి. అయితే ఇప్పుడతనికి సమయం లేదు. అవతల పని ఒత్తిడి చాలా ఉందని వూరుకున్నాడు. కొద్దిరోజులకి తిరుగుప్రయాణమయ్యాడు. సుడులు తిరుగుతోన్న నీటిని, బుడగల్ని చూసి వెండిగిన్నె కోసం సముద్రంలోకి దూకాడు. నీటిలో వెదకసాగాడు. తోటి ప్రయాణికులు కేకేసి అడిగారు.‘‘ఏంటయ్యా వెతుకుతున్నావు’’విషయం చెప్పాడతను. విన్నవారు నవ్వుకోసాగారు.