చిన్న పాప హత్యకు గురైంది. పాపను ఎక్కడోచంపి తెచ్చి స్కూలు ఆవరణలో పడేశారు. చూడగానే ఆ విషయం తెలుస్తోంది. డిటెక్టివ్‌ శరత్‌ పాప శవాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. శవాన్ని రెండోవైపు తిప్పి చూశాడు. అతడి భృకుటి ముడిపడింది. ఏదో బలమైన వస్తువుతో పాపను కొట్టారు. చివరకు తల్లిదండ్రులను కూడా అనుమానించాడు శరత్‌. ఇంతకూ ఎవరీ ఘాతుకానికి పాల్పడ్డారు? వాళ్ళకేం కావాలి?

‘చాలా దారుణం’ ఎవరో అంటున్నారు వెనుక నుంచి.డిటెక్టివ్‌ శరత్‌ దృష్టి పాప శవం పైనుంచి కదలటం లేదు.‘ఎక్కడో చంపి ఇక్కడ తెచ్చి పారేశారు’ ఇటెవరో అన్నారు.శవాన్ని చూడగానే తెలుస్తోంది హత్య ఇక్కడ జరగలేదని.‘స్కూలు కాంపౌండ్‌లో పారేశారు. స్కూలుకి అపఖ్యాతి తేవాలని కాబోలు’ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి సౌంజ్ఞ చేశాడు శరత్‌. అతడు దగ్గరకు వచ్చాడు. చాలామంది గుమిగూడారక్కడ.‘ముందు వీళ్ళందరినీ దూరం పంపించెయ్యాలి. వీళ్ళు పరిశోధనకు అడ్డుపడతారు’ చెప్పాడు శరత్‌.పోలీసులకు సూచనలు ఇచ్చాడు విజయ్‌. నిమిషాలలో ఆ స్థలం ఖాళీ అయింది.శవాన్ని జాగ్రత్తగా పరిశీలించటం ప్రారంభించాడు శరత్‌.ఒకవైపు శవంమీద ఎలాంటి గాయాలు లేవు. మరోవైపు తిప్పగానే అర్థమైంది.ఎవరో బ్యాట్‌తోనో, మరేదో బలమైన వస్తువుతోనో పాపను చితకబాదారు. అందువల్ల మరణం సంభవించి ఉంటుంది.శరీరంపై మరో ఆధారం లేదు.‘ఎక్కడో చంపి ఇక్కడికే తెచ్చి పారేయటంలో ఉద్దేశ్యం ఏమిటో?’ అన్నాడు విజయ్‌.ఇంతలో పెద్దగా ఏడుస్తూ పాప తల్లిదండ్రులు వచ్చారు.

‘వీరిని ప్రశ్నించాలి’ అన్నాడు శరత్‌.విజయ్‌ అందుకు సూచనలిచ్చాడు.అసిస్టెంట్‌ రామువైపు తిరిగాడు శరత్‌. ‘రామూ... వారి కుటుంబ నేపధ్యం సేకరించు. ఎలాంటి తగాదాలు, ద్వేషాలు ఉన్నాయేమో తెలుసుకో. సాధారణంగా ఇలాంటి హత్యలు సన్నిహితులు బంధువులే చేస్తుంటారు. పసిపిల్లలు వాళ్ళ దగ్గరకు త్వరగా వెళ్తారు’.‘యెస్‌ బాస్‌’ అన్నాడు రాము.‘ఇంకో పని.. హత్య ఇక్కడ జరగలేదు. కానీ ఈ పరిసరాల్లోనే జరిగి ఉంటుంది. ఇక్కడనుంచి రెండు మూడు కిలోమీటర్ల రేడియస్‌లో వెతకమని నీ అసిస్టెంట్లకు చెప్పు. హత్య జరిగిన స్థలం తెలుసుకుంటే, ఇంకా ఏమైనా ఆధారాలు దొరకవచ్చు’ అన్నాడు.‘యెస్‌ బాస్‌’ అన్నాడు రాము.‘మమ్మల్ని అనుమానిస్తున్నారా?’ ఆశ్చర్యంగా అడిగింది పాప తల్లి పావని.