కసితో రెచ్చిపోతూ కసాకసా గుచ్చేసింది తుపాకీ మొన. ఆర్తనాదాలతో అదిరిపోయింది అడవి - ‘ఎప్పుడ్రా? ఇంకెప్పుడంట?’ అనరిచింది. ‘ప్లీజమ్మా, వదిలేయ్‌...’ తట్టుకోలేక కేకలు పెట్టారు వాళ్ళు.‘బీహార్లో ఇప్పుడు బందిపోట్లు లేరని వూపుకుంటూ వచ్చేశార్రా? మేం లేమా? డాన్‌ లేడా? ప్రాణాలుండవ్‌!’ - చిత్ర హింసలు పెట్టసాగింది శర్మ బ్రదర్స్‌ని ...

అతను ప్రాణాలరచేత పట్టుకుని వచ్చేసి కిందపడిపోయాడు, ‘తప్పించుకొచ్చా - నా తమ్ముణ్ణి చంపేస్తారు!’ గోడుగోడున ఏడ్వసాగాడు. లఖీసరాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి వివరాలు తీసుకుని, వెంటనే మూతబడ్డ సిమెంట్‌ ఫ్యాక్టరీకెళ్లేసరికి, పరారవుతున్నారు గ్యాంగ్‌. బందీ కట్లు విప్పదీసి పోలీస్‌ స్టేషన్‌కి తెచ్చాడు. తమ్ముణ్ణి చూసుకుని బావురుమన్నాడు నారాయణ్‌ యాదవ్‌. ‘అయినా ఎవడో బీహార్‌ నుంచి కాల్‌ చేస్తే నమ్మి వచ్చేయడమేనా? వ్యాపారం చేసుకోవడానికి యూపీ సరిపోలేదేటీ?’ మండిపడ్డాడు అధికారి.ఇది జరిగి నాలుగు రోజులైంది. ఇప్పుడు ఐదోరోజు జిల్లా ఎస్పీ మనూ మహారాజ్‌ నుంచి కాల్‌ వచ్చింది. ‘‘చెబితే విన్నావా? ఆ రంజిత్‌ మండల్‌ - అదే - ఆ రంజిత్‌ డాన్‌ గాడి మీద ఎఫ్‌ఐఆర్‌ ఇష్యూ చేసి వెతకమంటే విన్నావా? యాదవ్‌ బ్రదర్స్‌ సేఫ్‌ అని ఊర్కున్నావ్‌. చూడు మళ్ళీ ఏం చేశాడో! శర్మ బ్రదర్స్‌ అట... ఢిలీకి చెందిన సురేష్‌ శర్మ, కపిల్‌ శర్మ.

వీళ్లది పాలిష్‌ రాయి వ్యాపారం. బీహార్‌ నుంచి కాల్‌ వెళ్ళింది వాళ్ళకి. డాన్‌ గాడి కాల్‌. గోపాల్‌ గోయెల్‌నంటూ మార్వాడీలా మాట్లాడేడు. హవేలీ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ లో పన్నెండు కోట్ల మార్బుల్‌ టెండర్‌ ఎరగా వేసి రప్పించాడు. గవర్నమెంట్‌ నుంచి ఇంకో రెండొందల కోట్ల కాంట్రాక్టు ఎలా లాగాలో కూడా తనకి తెలుసన్నాడట. టికెట్లు వాడే పంపాడు. పాట్నా దిగగానే కిడ్నాప్‌ చేశాడు. వాళ్ళఫాదర్‌కి కాల్‌ చేసి ఐదు కోట్లు అడిగాడు. వీడేనా లాస్ట్‌ ఇయర్‌ మధ్యప్రదేశ్‌ వాణ్ణి ఇలాగే కిడ్నాప్‌ చేసి డబ్బు గుంజాడు... మొన్న యాదవ్‌ బ్రదర్స్‌కి ఏంటదీ...వాటర్‌ ప్రూఫింగ్‌ కాంట్రాక్టా? బుద్ధిలేకపోతే సరి. చూడూ, డాన్‌ గాణ్ణి ఫినిష్‌ చేయడం గురించి ఆలోచించు ముందు’’. ఆలోచనలో పడ్డాడు అధికారి.