‘విచ్చలవిడితనం నేరప్రవృత్తిని పెంచుతుందా అన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే సమాజంలో వ్యక్తుల స్వేచ్ఛపెరుగుతోందిగానీ ఆ స్వేచ్ఛకు తగ్గుట్టు మనస్తత్వం మారకపోవడంతో అది పలురకాల వికృతాలకు దారితీస్తోంది. నేర పరిశోధనలో దీనిపై దృష్టి కేంద్రీకరించాలి’ అసిస్టెంట్ రాముకు పరిశోధనా మెళుకువలు వివరిస్తున్న శరత్, సెక్రటరీ సుధ గదిలోకి రావటంతో ఆ వైపు చూశాడు.‘బాస్, అర్జంటుగా కలవాలట ఎవరో వచ్చారు’ సుధ చెప్తుంటేనే ఓ నడివయసు వ్యక్తి లోపలకు వచ్చాడు.‘నా అల్లుడే నా కూతురిని హత్యచేశాడు. పోలీసులు దాన్ని ఆత్మహత్యగా ప్రకటించేలోగా మీరు నిజం తేల్చాలి’ కన్నీళ్ళతో అభ్యర్థించాడతడు.
‘దగ్గరకు జారేసి ఉన్న తలుపులు తట్టింది పనిమనిషి. పని మనిషి తలుపు తట్టింది. ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. లోపలకు వెళ్ళి గదుల్లో వెతికింది. మంచంపైన సుమతి పడుకుని కనిపించింది. ఎంత పిలిచినా పలకలేదు. తట్టి లేపబోతే అర్థమైంది, ఆమె శవమైపోయిందని’ చెప్పాడు ఇన్స్పెక్టర్ విజయ్.‘ఆమె భర్త?’ అడిగాడు శరత్.‘ఇవాళ్ళ పొద్దున్నే బెంగుళూరు నుంచి విమానం దిగాడు. వెంటనే అరెస్టు చేశాం. ఇంకా ప్రశ్నించాలి’.క్రైమ్‌సీన్ పరిశోధకులు అప్పటికే తమ పని పూర్తిచేశారు. ఇంట్లో అన్నిచోట్లా వేలి ముద్రలు సేకరించారు. గదులన్నీ తిరిగి పరిశీలించాడు శరత్. ఎక్కడా అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదు. తర్వాత శవాన్ని పరిశీలిస్తుండగా శరత్ భృకుటి ముడిపడింది.విజయ్ అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.‘ఇది ఆత్మహత్యో, సహజమరణమో కాదు, ఇది హత్య’ గంభీరంగా అని ఇంకాస్త జాగ్రత్తగా పరిశీలన ప్రారంభించాడు.‘మెడమీద అతిసన్నని ఈ గాటు చూడు. ఏదో సన్నినిదాన్ని బిగించారు. ప్రాణం ఉన్నప్పుడు ఏర్పడిన గాయం’.