బిడ్డనెత్తుకుని వడివడిగా లోపలికెళ్ళింది పూర్వంతి. మెట్లెక్కసాగింది. బెడ్రూం దగ్గరాగి, ‘‘లేవండీ...’’ అని డోర్‌ మీద కొడుతూ వెనక్కి చూసి, ‘చూశారా? చాలా సేపట్నించీ ఇంతే....’ అంది ఆందోళనపడిపోతూ.....

ఆమె వెనుకే అక్కడికి చేరుకున్న వాళ్ళిద్దరూ తలుపుతట్టి చూశారు. కొట్టి కొట్టి పిల్చారు. అయినా స్పందన లేదు. దీంతో, విరగ్గొట్టి లోపలికి చూశారు. నిశ్శబ్దంగా వుంది. వెల్లికిలా పడుకుని ఉందామె బెడ్‌ మీద, నిద్రపోతున్నట్టు. ఒక చెయ్యి కిందకి వేలాడుతోంది. ఆ చేతిలో రక్తంతో తడిసిన కత్తి......షాకైపోయింది పూర్వంతి. వెంటనే కాల్‌ చేశారు ఆ పోలీసులిద్దరూ. ఇన్‌స్పెక్టర్‌ అవంగ్‌ వచ్చి చూశాడు ఆ దృశ్యాన్ని. అరవై ఏళ్ల మేడమ్‌ హర్చిత్‌ ఆత్మహత్య చేసుకుంది. పూర్వంతి నమ్మలేకపోయింది. ఉదయమే మేడమ్‌ కొడుకూ, కోడలూ పెద్ద కొడుకుని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళిపోతూ, చిన్న కొడుకుని మేడమ్‌ దగ్గరే ఉంచారనీ, మేడమ్‌ బాబుని తనకప్పగించి నిద్రపోతానని డోర్‌ వేసుకుందనీ, అప్పట్నించీ తీయడమే లేదనీ ... ఏడ్వసాగింది. టెక్నికల్‌ టీం దిగింది. మృతదేహం ఎడమ చేతిలో కత్తి ఉంది, కుడి మణికట్టు తెగింది. గొంతు మీద రక్కుళ్ళున్నాయి. కుడి కన్ను దెబ్బతింది. ఇది హత్య చేసి, ఆత్మహత్యలా చిత్రించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడింది టీం.

లోపలి నుంచి డోర్‌ పెట్టి ఉంటే, హత్య ఎలా చేస్తారని చూస్తే, అటు కిటికీ తెరచి ఉంది. అక్కడ్నించే రాకపోకలు జరిపివుండాలని, చుట్టు పక్కల విచారణ ప్రారంభించాడు ఇన్‌స్పెక్టర్‌ అవంగ్‌. కానీ ఒక ప్రశ్న అలాగే వుంది? హంతకుడు ఆమె చేతిలో కత్తి పెట్టి ఆత్మహత్యలా సృష్టించబోవడంలో ఉద్దేశం? ఇంట్లో విలువైనని ఏవీ కూడా పోలేదు. దోపిడి కోసం కాకపోతే మరెందుకు? ఇంట్లోకి ఎవరి రాకపోకల్నీ గమనించలేదని చుట్టు పక్కల నుంచి సమాచారం వస్తోంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నగరంలోని ఆ సంపన్న ప్రాంతంలో... హత్య జరిగిందని కూడా ఎవరికీ తెలీదు.ఫ ఫ ఫఇన్‌స్పెక్టర్‌ అవంగ్‌ పోస్ట్‌మార్టం రిపోర్టు చూస్తూ కూర్చున్నాడు. అంతలోనే హర్చిత్‌ భర్త వచ్చి, ఎవరు రాశారో తెలీదంటూ కొన్ని ఉత్తరాలు చూపించాడు. పూర్వంతితో మీరు జాగ్రత్తగా ఉండాలనీ, బయటికిపోతే గేటు లాక్‌ చేసి వెళ్ళాలనీ.. ఆ ఉత్తరాల్లో ఆకాశరామన్న సలహా. అవంగ్‌ వాటిపైపు చూస్తూ... ‘‘మీ పని మనిషి పూర్వంతి అంత మంచిది కాదా?’’ అనడిగాడు. చెప్పలేక పోయాడతను.

అతణ్ణి పంపించేసి రిపోర్టులోకి చూశాడు అవంగ్‌. మరణ సమయం ఉదయం పది - పదకొండున్నర మధ్య అని వుంది. గొంతు మీద వేళ్ళతో చేసిన రక్కుళ్ళున్నాయనీ, ఊపిరాడ కుండా చేసి చంపినట్టుందనీ వివరించాడు డాక్టర్‌. అలాగే కపాలం లోపలి తలంలో రక్తం గడ్డ కట్టిందనీ, తలమీద గట్టి దెబ్బ తగిలితే ఇలా అవుతుందనీ నివేదికలో రాశాడు. తీవ్ర ఆలోచనలో పడ్డాడు అవంగ్‌. కిటికీ మీద గానీ, లోపల తలుపు మీద గానీ వేలిముద్రల్లేవు. కత్తిమీద హతురాలి వేలిముద్రలున్నాయి. కత్తి బయటి నుంచి రాలేదు. అది ఇంట్లోదే, కిచెన్‌ లోనే ఉండేదని చెప్పాడు హతురాలి భర్త. ఇది హతురాలు మణికట్టు మీద కోసుకుని ఆత్మహత్య చేసుకున్న కేసు కానప్పుడు, కత్తి ఆమే తీసికెళ్ళే అవకాశం లేదు. తలమీద దెబ్బ కొట్టి, గొంతు పిసికి చంపిందెవరు? హతురాలి చేతిలో కత్తి ఇంట్లోదైతే, దాన్ని ఇంట్లోని మనిషే తీసికెళ్ళి ఉండాలి. అదెవరు? భర్తేనా? పనిమనిషి పూర్వంతితో కలిసి ఈ హత్య చేశాడా? ఎందుకు? ఈ ఉత్తరాలు నిజమేనా? ఒకవేళ పూర్వంతితో తనకి ఎఫైర్‌ ఉన్నట్టయితే, అది బయట పడకూడదని తనే ఉత్తరాలు సృష్టించి దృష్టి మళ్లిస్తున్నాడా?