అర్థరాత్రి...ఊరుబైట పాడుబడ్డ బంగళా.పెద్దపెద్ద స్తంభాలతో పెచ్చులూడిపోయి పాకురుపట్టినగోడలు అసహ్యంగా ఉన్నాయి. హోరుగాలి. చెక్కతలుపులు, కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయి. జడలదయ్యాల్లా చెట్లు తలూపుతున్నాయి. ఎలాంటివారికైనా భయంపుట్టించే వాతావరణం అది.

బంగళాలో హాలుమధ్య స్ట్రెచర్‌పై ఇనుప గొలుసుల బందీలో ఉందో అమ్మాయి. దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకంగా అరుస్తోంది. నల్లటి గౌన్లు ధరించిన కొందరు ఆమె చుట్టూ మూగారు. వాళ్ళ మొహాలు కనిపించడంలేదు. చేతుల్లో మాత్రం కాగడాలు. ఆ వెలుతురులో వాళ్ళ కళ్ళు రక్తపుముద్దల్లా ఎర్రగా మెరుస్తున్నాయి. పదునైనకోరలతో భయంకర పిశాచాల్లా ఉన్నారు. వాళ్ళచేతుల్లో ఉన్నవి ఆపరేషన్‌ పరికరాలుకావు. తుప్పుపట్టిన పటకాకత్తులు, రంపాలు. కాగడాల వెలుతురులో ఆమెకు ఆపరేషన్‌ చేయడానికి సిద్ధమయ్యారు వాళ్ళు.వాళ్ళలో ఒకడు అమ్మాయి మొహంలోకి చూసి ‘‘ఈ అమ్మాయి మొహం పాలిపోయింది అర్జంటుగా రక్తం ఎక్కించాలి’’ అని ఆదేశించాడు.

ఆ మాటవిని అమ్మాయి ఒక్కసారిగా గబుక్కున లేచికూర్చుంది. తన పక్కనున్న వ్యక్తి చెయ్యి గట్టిగా పట్టుకుని నోటి దగ్గరకు తీసుకొని పండ్లు దిగబడేలా కొరికి రక్తం జుర్రుకోసాగింది. ఆ వ్యక్తిపెడుతున్న కేకలు గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. ఆమె పెదవులు, నోరు ఎర్రని ఎరుపుతో భయం పుట్టేలా ఉన్నాయి.ఇంతలో ‘కట్‌... అన్నకేక. దాంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.‘‘వెల్‌డన్‌ అనుషా, షాట్‌ అద్భుతంగా వచ్చింది. థియేటర్‌లో అందరూ ఊపిరి బిగపట్టి చూస్తారు అభినందనగా అన్నాడు డైరెక్టర్‌ శ్యామ్‌.‘‘థ్యాంక్యూ సార్‌, మనకు కావల్సింది కూడా అదే కదా’’ తన చెయిర్‌లో కూర్చుంటూ ఫ్రెండ్‌ ప్రవీణ్‌ కోసం చుట్టూ చూసింది అనూష.

‘‘నా ఫ్రెండ్‌ ప్రవీణ్‌ ఎటెళ్ళాడు’’ మేకప్‌మెన్‌ను అడిగింది. చూడలేదు అన్నాడతను.డైరెక్టర్‌ ప్యాకప్‌ చెప్పడంతో కొండాపూర్‌లోని తన ఫ్లాటుకు చేరుకుని ప్రవీణ్‌కు రింగ్‌ ఇచ్చింది అనూష.‘‘హలో...’’‘‘ఆఁ హల్లో.....’’‘‘ఏయ్‌...సడన్‌గా ఎటెళ్ళి పోయావు?’’ ఆమె గొంతులో అసహనం.‘‘నిజం చెప్పమంటావా, నాకు హర్రర్‌ సినిమాలంటే భయం బాబూ! అందులోనూ నిన్ను అలా దయ్యం వేషంలో...చచ్చే భయం వేసింది’’పగలబడి నవ్వింది అనూష.‘‘సరేగానీ నువ్వెక్కడున్నావు?’’‘‘సబ్‌ వే రెస్టారెంట్‌లో. డిన్నర్‌ చేద్దాం రా’’‘‘ఓ.కే...’’ అంటూ కారెక్కి, ‘‘సబ్‌వే క పోనీ’’ అంది డ్రైవర్‌తో.