మిస్‌ ఢిల్లీకోడలు గెంటేస్తే రోడ్డున పడ్డ సుభాష్‌, పావని పోలీస్‌స్టేషన్‌ కెళ్ళి మొరపెట్టుకున్నారు- ‘‘మా అబ్బాయి గుండెపోటుతో పోయాడని చెప్పింది, ఆస్తులు లాక్కుని మమ్మల్ని వెళ్ళగొట్టేసింది... మీరే కాపాడాలి! ’’ అంటున్న వాళ్లకి హామీ ఇచ్చి పంపేశాడు యమునా నగర్‌ ఎస్సై. కేసులో కదలికలేదు. పై అధికారిని కలిసినా అతీగతీ లేదు. చండీఘర్‌ వెళ్లి ప్రైవేట్‌ డిటెక్టివ్‌లకి చెప్పుకున్నారు. నిఘాపెట్టి, కోడలు ప్రియాంక కదలికల్ని గమనించసాగారు డిటెక్టివ్‌లు. ఇద్దరు పిల్లలతోనే ఉంటోంది. ఇంటికెవరూ రావడం లేదు. బయటికెళ్లినా ఎవర్నీ కలవడం లేదు. నాలుగు నెలలు కాపు కాసీ కాసీ ఒక ఆధారంతో వచ్చారు.

‘‘ఇతను రోహిత్‌ అనీ జిమ్‌ ట్రైనర్‌. ఎప్పట్నించీ పరిచయమో తెలీదు. అతడితో మీ కోడలి ఫోటో ఇదీ...’’ అని చూపించారు. ఆ ఫోటో చూసి ఏమిటని అడిగాడు ఎస్పీ. మళ్ళీ ఓపిగ్గా చెప్పారు సుభాష్‌, పావని. ఐజీపీని కూడా కలిసి చెప్పారు. వెంటనే ఐజీపీ, కర్నాల్‌ పోలీస్‌స్టేషన్‌కి కేసుని ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ, క్రైం ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (సిఐఎ) -2 కింద ‘సిట్‌’ని ఏర్పాటు చేసి, ఐఓగా ఇన్‌స్పెక్టర్‌ రాంపాల్‌ని నియమించాడు. రాంపాల్‌ రంగంలోకి దిగాడు. ‘అమ్మా, నన్నెవరో గూండాలు చంపేస్తున్నారే, చంపేస్తున్నారే!!’ పావని చెవుల్లో ఈ మాటలింకా గింగురుమంటూనే వున్నాయి. అన్నప్పుడల్లా వణికిపోతోంది. రాంపాల్‌కి చెప్పుకొచ్చింది. ‘‘కాలేజీలోనే ప్రేమించాడు. ఆమె అందాల పోటీల్లో మిస్‌ ఢిల్లీగా ఎంపికైంది. అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. మేమంతా సంతోషించాం.

పద్దెనిమిదేళ్ళయి పోయాక, ఇద్దరు పిల్లలున్నాక ...ఏం చేసిందో మాకు తెలీదు. కానీ గుండె పోటంటే నమ్మం. గుండె పోటైతే శరీరం నీలి రంగులోకెలా మారుతుంది...’’టీముని జిమ్‌కి పంపాడు రాంపాల్‌. తను ప్రియాంక దగ్గరి కెళ్ళి ఫోటో చూపించాడు. ఆమె కొట్టి పారేసింది- ‘‘ఏంటి మీ అనుమానం? బరువు తగ్గాలని జిమ్‌ కెళ్తున్నాను యోగేష్‌ వున్నప్పట్నించే. ఇది యోగేష్‌కీ తెలుసు. జిమ్‌లో నా పర్సనల్‌ ట్రైనర్‌ రోహిత్‌తో ఫోటో దిగితే ఏదో అయిపోయినట్టా?’’‘‘మెడికల్లీ ఫిట్‌గా వున్న యోగేష్‌కి గుండెపోటెలా వచ్చింది? నువ్వెందుకు హడావిడిగా నీ అత్తామామల నోళ్ళు మూయించి దహనసంస్కారాలు జరిపించేశావ్‌? ఈ మధ్య నీ భర్త ప్లయివుడ్‌ ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలూ, ఈ బంగళా, బయట స్థలాలూ నీ పేర ఎందుకు మార్పించుకున్నావ్‌? మార్పించుకుని వాళ్ళని ఎందుకు బయటికి పంపేశావ్‌? నిన్ను అనుమానించడానికివి చాలవా?’’