కళ్ళు చెదరించే అందం ఆమెది. ఒక్కసారి చూస్తే చూపు మరల్చుకోలేరు. మొదటి చూపులోనే మోహించాడతను. ఆమెకోసం తపించిపోయాడు. తరచుగా ఏదో వంకతో ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఆమెనే చూస్తూ గడిపేవాడు. మౌనంగా గమనిస్తూ లోలోపల పొంగిపోయేది ఆమె. ఒకసారి ఏకాంతంగా దొరికిందామె. ఆమె కళ్ళను ముద్దాడి మెల్లిగా కిందకుజారి ఆమె పెదవులు అందుకున్నాడతను. ఉవ్వెత్తున ఎగసిన కోరికలతో అతడిని హత్తుకుపోయిందామె. ఇక దొరికిన ప్రతి అవకాశం ఉపయోగించుకుని హాయిగా గడిపేవారు ఇద్దరూ. ఆ తర్వాత...? ఆ తర్వాత ఏం జరిగింది?

రాత్రి పన్నెండు గంటల సమయంముంబయి మహానగరంపోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ కామత్‌ డ్యూటీ చేస్తున్నాడు.‍ఫోన్‌ కెవ్వుమని అరిచింది.వెంటనే ఫోన్‌ అందుకున్నాడతను.‘‘నేవీనగర్‌ సమీపంలో మెయిన్‌రోడ్డుకు ఆనుకున్న బైపాస్‌రోడ్డు పక్కన ఓ యువతిశవం ఉంది’’ ఓ కంఠం కంగారుగా చెప్పింది.‘‘హలో, ఎవరు మాట్లా....’’ అడిగేలోపే ఫోన్‌ కట్‌ అయింది.సిబ్బందిని వెంటబెట్టుకుని బయలుదేరాడు కామత్‌.ఘటనాస్థలం దగ్గర జనం గుమికూడి ఉండటం దూరంనుంచి కనిపించింది. పోలీస్‌ జీప్‌ చూడగానే అక్కడ చేరినవాళ్ళలో సగం మంది మంత్రం వేసినట్టు మాయమయ్యారు. మిగిలినవారు దూరంగా జరిగి కుతూహలంగా చూడసాగారు.రోడ్డువారనే పడి ఉంది శవం. శవం చుట్టూ రక్తం మడుగు.

ఇన్‌స్పెక్టర్‌ కామత్‌ శవాన్ని సూక్ష్మంగా పరిశీలించాడు. హతురాలు అందమైనదే. పాతికేళ్ళు ఉండొచ్చు. మెడలో, చెవులకు, చేతివేళ్ళకు బంగారు ఆభరణాలున్నాయి. డబ్బు,నగల కోసం హత్య జరగలేదని కామత్‌కు అర్థమైపోయింది. పొట్టలోతప్ప ఇంకెక్కడా గాయాలులేవు. శరీరంమీద, బుగ్గలమీద ఎలాంటి రక్కులు, పంటి గుర్తులు కనిపించలేదు. ధరించిన దుస్తులు చెదరిపోలేదు. అత్యాచారం జరిగిన దాఖలాలు లేవు. ఆమె బట్టల అడుగున లేడీస్‌ పర్స్‌ కనిపించింది.

లిప్‌స్టిక్‌, కొంత సొమ్ము, ఉత్తరాలు పర్సులో కనిపించాయి. నాగపూర్‌ అడ్రసుకు డెలివరీ చేసిన ఉత్తరాలవి. ఒక ముఖ్యమైన క్లూ దొరికిందని ఇన్‌స్పెక్టర్‌ కామత్ ఊపిరి పీల్చుకున్నాడు.పంచనామాచేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.సిబ్బందిని వెంట బెట్టుకుని సెండర్స్‌ అడ్రస్సులో రాసిన చిరునామాకు వెళ్ళాడు. పోలీస్‌లను చూడగానే కమల్‌ముఖం రక్తం లేనట్టు పాలిపోయింది. అతన్ని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాడు కామత్‌.