వరిపొలాల్లో సిట్టింగ్‌ పెట్టారు ముగ్గురూ. చిమ్మచీకట్లో మొహాలు కన్పించడం లేదు, మాటలే వినిపిస్తున్నాయి. ఎంగేజ్‌మెంటుకి ఎందుకొచ్చావని మధుని అడుగుతున్నాడు మనూ. సమాధానం చెప్పకపోవడంతో ఉన్నవిస్కీ అంతా మధు గ్లాసులో పోసేశాడు లింటో. అ...దంతా తాగేసి తూలుతూ, మనూ మొహం మీద టార్చి వేశాడు మధు. సమాధానం చెప్పకుండా మొహం మీద టార్చి వేసేసరికి మండిపోయి కేబుల్‌ తీశాడు మనూ. అమాంతం మధు మీద పడి, కదలకుండా పట్టుకున్నాడు లింటో. కేబుల్‌తో మధు మెడ చుట్టేసి పిచ్చి కోపంతో లాగసాగాడు మనూ.‘ఎందుకొచ్చావ్‌ రా? రావొద్దంటే ఎందు కొచ్చావ్‌!’ గిలగిల కొట్టుకుంటున్న మధుని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళసాగాడు మనూ...

*************************** 

మర్నాడు వంతెన కింద బురద నీట్లోకి చూడసాగాడు లింటో. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న అతన్ని మధు చెల్లెలు గమనిస్తోంది. శవం పైకి తేలలేదని మనూకి కాల్‌ చేసి చెప్పాడు లింటో. మర్నాడు వూళ్ళో గగ్గోలు పుట్టింది. కేరళ అలపుళ జిల్లా, ఎడత్తువా గ్రామమంతా వచ్చి వంతెన దగ్గర చేరింది. కొయ్యబారిన మధు శవం పైకి తేలుతోంది. ఎస్సై ఆనంద బాబు శవం మెడకున్న కేబుల్‌ని చూసి హత్య కేసుగా రిపోర్టు చేశాడు సీఐకి. శవాన్ని పైకి తీసి పంచనామా చేస్తూంటే అక్కడ చేరి చూడసాగారు మనూ, లింటోలు. పంచనామా పత్రాల మీద సాక్షులుగా సంతకాలు కూడా చేశారు.

****************** 

‘‘మనకేం కాదుగా ?’’ అడిగాడు లింటో.‘‘రెండు సినిమాలు చూసి ప్లాన్‌ చేశా’’ నిర్లక్ష్యంగా అన్నాడు మనూ. ‘‘సినిమాలా?’’‘‘మరే... ‘దృశ్యం’ 17 సార్లు, ‘సేతురామన్‌ అయ్యర్‌ సీబీఐ’ 5 సార్లు చూసొచ్చి స్కెచ్‌ గీశా.. ఎవరేం చేయలేరు మనల్ని!’’

****************** 

ఊరి జనమంతా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు రాజకీయం చేస్తున్నారనీ, వెంటనే హంతకుల్ని గ్రామం ముందు ప్రవేశపెట్టాలని పోలీస్‌స్టేషన్‌ ముందు చేరి నినాదాలు చేస్తున్నారు. జనాలకు సారథ్యం వహిస్తున్న మనూ, లింటోలు స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదనీ, కేసుని క్రైంబ్రాంచ్‌కి బదిలీ చేయాలనీ డిమాండ్‌ చేశారు. వారం రోజులైనా ఆందోళన తగ్గక పోవడంతో జిల్లా ఎస్పీ స్పెషల్‌ టీంని ఏర్పాటు చేశాడు. డిప్యూటీ ఎస్పీ అనీష్‌ కోరా, సీఐ విద్యాధరన్‌, ఎస్సై ఆనంద బాబులతో కూడిన టీం రంగంలోకి దిగింది.