‘‘యువరానర్‌... ఎంత కిరాతకంగా నేరానికి పాల్పడ్డాడో, అంతే కఠినశిక్ష విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను...’’‘‘యువరానర్‌.. నేరం చేసినప్పుడు వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువశిక్ష విధించాలని కోరుతున్నాను. ఇప్పటికే ఆరేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకి లోనయ్యాడు...’’ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేశాయ్‌, డిఫెన్స్‌ న్యాయవాది అనక్‌ లెటోలు చెబుతున్నది వింటూ, ‘‘వయసుని దృష్టిలో పెట్టుకునే ఇంత నేరంచేశాడంటారా, మిస్టర్‌ అనెక్‌ లెటో?’’ అని ప్రశ్నించాడు జడ్జి.ముగ్గురి మొహాలూ చూస్తూ బోనులోనిలబడ్డాడు డయాజ్‌...

స్నేహాల్‌ డయాజ్‌... గంపెడు బట్టలు ఉతుకుతూంటే చేతులు నొప్పెడుతున్నాయి. బకెట్లో వేసి పిండుతూంటే ఆ నీళ్ళల్లో తల్లి రూపమే కన్పిస్తోంది. తల్లి తల పట్టుకుని నీళ్ళలో ముంచుతూ చంపడానికి ప్రయత్నిస్తున్న తండ్రి... ఒకసారి కాదు, చాలాసార్లు. ‘‘ఏరా? ఏంటీ?’’ అని వీపు పగిలేలా కొట్టింది సవతి తల్లి వచ్చి, ‘‘ఉతుకు! ఉతికితేనే నీకు బతుకు!’’ జుట్టుపట్టుకుని కసిదీరా వంగదీసింది. బాధతో అరిచాడు.‘‘అవన్నీ ఉతికాకే తిండి పెట్టాలి!’’ ఇంట్లోంచి తండ్రి అరుపు.ఉదయం నుంచీ మధ్యాహ్నం దాకా ఇంటెడు బట్టలుతికితేనే ఇంత తిండి పెడతారు. ఏడేళ్ళ వయసుకి ఇది పెద్ద కష్టమైపోయింది. బయటపడే మార్గం కన్పించడం లేదు- తల్లి కన్పించనట్టే. తల్లి ఎలా చనిపోయిందో అర్ధం గావడం లేదు. లంచగొండి తండ్రి గోవా షిప్‌ యార్డులో ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలుసు.

అప్పుడామె ఆత్మహత్య చేసుకుందని కొందరు, విషమిచ్చి చంపాడని కొందరూ చెప్పుకున్నారు. ఆమెకి విషమిచ్చి తర్వాత నిప్పంటించాడని కూడా కొందరు చెప్పుకున్నారు. ఏమైనా పోలీసులు పట్టుకోలేదు. వెంటనే ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇది వచ్చిన కాడ్నించీ చంపుకుతింటోంది. దీనికి వంత పాడుతున్నాడు యెదవ తండ్రి ...

******** 

‘‘వెరీ సారీ బ్రో, నీకింత వుందని తెలీదు’’‘‘ఇంకా చాలా వుంది, నా ఫాదర్‌ ఒక గాడిద! ఈ గాడిద వెంట అది వుంది చూశావూ- అదొక గాడిదన్నర గాడిద!’’19 ఏళ్ల స్నేహాల్‌ డయాజ్‌, పాతికేళ్ళ నరేష్‌ డురాడోలు ఫ్లాట్‌లో మందుకొడుతూ మాట్లాడుకుంటున్నారు. పక్కన లాప్‌టాప్‌లో అల్ర్ఫెడ్‌ రోజ్‌ కొంకణి పాట వస్తోంది.

పదిహేను రోజుల క్రితం పరిచయమైన డయాజ్‌ బాగా క్లోజ్‌ అయిపోయాడు. గోవా పోర్టు సిటీ వాస్కో సమీపంలోని చిన్న గ్రామం చికలింలో నరేష్‌ ఫ్లాట్‌కి తరచూ వచ్చి కాలక్షేపం చేస్తున్నాడు. ‘‘నేనైతే పిచ్చిపట్టి తిరుగుతా రోడ్లమీద!’’ అని నరేష్‌ ఉద్వేగంగా అనడం చూసి, ‘‘నాకూ అప్పుడ ప్పుడూ పిచ్చెక్కుతూనే వుంటుంది బ్రో, నాగురించి తల్చుకుంటే’’ అంటూ బాటిల్‌ మొత్తం లేపేశాడు డయాజ్‌. మత్తులో తూలుతూ జేబులోంచి తీశాడు... ‘‘ఏ ? ఏ మిటవి?’’ కళ్ళు విప్పార్చుకుని చూస్తూ అన్నాడు నరేష్‌.