‘‘మా అబ్బాయిని మీరే రక్షించాలి?’’డిటెక్టివ్‌ శరత్‌ని కన్నీళ్ళతో వేడుకున్నాడు కనకయ్య.‘‘ముందు ప్రశాంతంగా కూర్చుని, తర్వాత చెప్పండి’’ అన్నాడు శరత్‌.‘‘నా పిల్లవాడి ప్రాణం ప్రమాదంలో ఉంది. చేయనినేరం వాడిమీద మోపారు, మీరే వాణ్ణి రక్షించాలి’’.

‘‘ఇంతకీ ఏం జరిగింది?’’‘‘మా వాడు ప్రభాకర్‌. కాలేజీలో తోటి అమ్మాయి శ్వేతను ప్రేమించాడు. వాళ్లు ధనవంతులు. కులం వేరు. ఆమె జోలికెళ్ళొద్దురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, మావాణ్ణి వదిలెయ్యమ్మా అని ఆ పిల్లకు కూడా చెప్పాను. ఇద్దరూ నా మాట వినలేదు. అందర్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. అందర్నీ వదులుకున్నారు. వేరే ఊళ్ళో కాపురం పెట్టారు. సర్లే, ఏదో సుఖంగా ఉన్నారనుకున్నాను. నా దగ్గరకు రాలేదు. వాళ్ల దగ్గరకు వెళ్లలేదు. ఇద్దరూ వేరే ఊళ్లో కాపురం పెట్టారు. కానీ ఆ అమ్మాయి ఒళ్లు కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. చావుకి మావాడే కారణం అని రాసిపెట్టింది. వీడికి వేరే ఎవరితోనో సంబంధం ఉందనీ, తనని వదిలేయమని ఒత్తిడి చేస్తున్నాడనీ, అతడిని వదలలేననీ రాసింది. మావాణ్ణి జైల్లో పెట్టారు.

ఇదంతా కుట్ర. కావాలనే వాడిని ఇరికించారు. మీరే రక్షించాలి’’ అన్నాడు కనకయ్య ఏడుస్తూ.ఆయన ఏడుపు తగ్గాక, ‘‘నా అసిస్టెంట్‌ రాము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి’’ అని రామూని పిలిచాడు శరత్‌. ‘‘హోప్‌లెస్‌ కేసు బాస్‌’’ శరత్‌తో అన్నాడు రాము.ఏమిటన్నట్టు చూశాడు శరత్‌.‘కనకయ్యది మరీ పేద కుటుంబం కాదు. ప్రభాకర్‌కి రెండేళ్ళక్రితం ఉద్యోగంరాగానే అందరినీ ఎదిరించి శ్వేత, అతను పెళ్ళిచేసుకున్నారు. ఐతే శ్వేత వాళ్లింటి రాకపోకలున్నాయి. తాను పొరపాటు చేశానని శ్వేత పలుసార్లు చెప్పిందని ఆమె తల్లిదండ్రులంటున్నారు.

ప్రభాకర్‌కి ఆఫీసులో అరుణ అనే అమ్మాయితో సాన్నిహిత్యం ఉందని శ్వేతకు అనుమానం. ఆమెతో పెళ్ళికోసం విడాకులిమ్మని శ్వేతపై ప్రభాకర్‌ ఒత్తిడి తెస్తున్నట్టు చెప్పిందని తల్లిదండ్రులంటున్నారు. సూసైడ్‌ నోట్‌లో కూడా ఇదే ఉంది. అరుణతో సాన్నిహిత్యాన్ని ప్రభాకర్‌ ఒప్పుకున్నాడు. కానీ శ్వేతను వదిలే ఉద్దేశ్యం లేదని, ఆమెను ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదని అన్నాడు. కానీ ప్రభాకర్‌ వాదనకు ఆధారాలు లేవు బాస్‌’’ చెప్పాడు రాము.