‘నాన్నా నన్ను క్షమించండి... మీకు చెప్పకుండా అమెరికా వచ్చేశాను. ఇక్కడ నాకు మంచి ఉద్యోగం దొరికింది. హ్యాపీగా ఉన్నాను...’’ అంటూ ఆకాంక్ష ఫోన్‌లో చెప్పడంతో అప్పటిదాకా పడిన టెన్షన్‌ నుంచి కొద్దిగా రిలాక్స్‌ అయ్యారు ఆమె తండ్రి శైలేంద్ర.పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో యునైటెడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు శైలేంద్ర. ఆయన ఏకైక కుమార్తె ఆకాంక్ష. ఆమెకు చక్కని వరుడ్ని చూసి పెళ్లి చేసి కూతుర్ని, అల్లుడ్ని తమ వద్దే ఉంచుకోవాలనుకున్నారాయన. కానీ ఆయనొకటి తలిస్తే మరొకటి జరిగింది.ఆకాంక్షకు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక మొదటి నుండి ఉండేది. రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసింది కూడా. ఎలాగైతేనేం... చివరికి అనుకున్నది సాధించింది. 

ఆకాంక్ష తమకు చెప్పకుండా వెళ్లిందని మనసులో బాధపడ్డప్పటికీ, కూతురుకు వచ్చిన ఉద్యోగం గురించి గొప్పగా సహోద్యోగులకు చెప్పుకున్నాడు శైలేంద్ర.ఆకాంక్ష అమెరికా నుంచి రోజు విడిచి రోజు తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తుండేది. నెలరోజుల తర్వాత తనకు రోజూ ఫోన్‌ చేయడానికి వీలుకావడం లేదని, వర్క్‌ ఎక్కువగా ఉందంటూ వాట్సాప్‌లో చాటింగ్‌ మాత్రమే చేయడం ప్రారంభించింది. చాట్‌లో కంటే ఫోన్‌లో మాట్లాడితే ఎక్కువ విషయాలు తెలుస్తాయని ఒకరోజు శైలేంద్ర ఫోన్‌ చేస్తే ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. ‘ఏమైందమ్మా...’ అంటూ మళ్లీ వాట్సాప్‌లోనే మెసేజ్‌ పెట్టారాయన.

‘డాడీ ఫోన్‌ చేయడానికి నాకు ఇక్కడ అవకాశం ఉండటం లేదు’ అంటూ వాట్సాప్‌లోనే సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత వాట్సాప్‌ చాట్‌ కూడా బంద్‌ అయ్యింది. ఆ ఫోన్‌నెంబర్‌ పనిచేయడం మానేసింది. దాంతో కుమార్తెను కాంటాక్ట్‌ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు శైలేంద్ర. కాని ఆమె క్షేమ సమాచారాలు ఏమీ తెలియలేదు. అప్పటికే ఆమె ఇంట్లోంచి వెళ్లి మూడు నెలలైంది. అమెరికాలోని కొందరు స్నేహితుల ద్వారా ఆకాంక్ష గురించి తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆందోళనకు గురైన శైలేంద్ర చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘ఆకాంక్ష ఉపయోగించిన రెండు సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేయమని, ఇమిగ్రేషన్‌ విభాగంలో ఆమె ఏ రోజు అమెరికా వెళ్లిందనే వివరాలను కూడా సేకరించమ’ని బంకురా ఇన్‌స్పెక్టర్‌ సత్యబ్రతను ఆదేశించారు ఎస్పీ సుకేంద్రు హీరా.