అదో పెద్ద బంగళా. ఉదయమే ఆ ఇంటి పనిమనిషి బెడ్‌కాఫీ కలిపి ఆ గది తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తెరచుకోలేదు. దబదబా తలుపులు బాదినా ఆమె నిద్రలేవలేదు. చివరకు మాస్టర్‌కీతో తలుపులు తీసి చూశారు. గదిలో బెడ్‌మీద అచేతనంగా పడిఉంది ఆమె. బీరువా చిందరవందర చేశారెవరో. నగలు దొంగిలించారు. కిటికీకి తాడు వేలాడుతోంది. ఇంతకూ రాత్రి ఏం జరిగినట్టు? ఆమెను రేప్‌చేసి చంపేశారా?

అదో ఖరీదైన బంగళా. అందులో ఉంటున్నది నలుగురే. యజమాని ఆనంద్‌, ఆయన భార్య గీతాంజలి. ఆనంద్‌ తమ్ముడు మోహన్‌, గీతాంజలి చెల్లెలు అంజలి. మోహన్‌ అవివాహితుడు.ఆ ఇంట్లో అందరికీ బెడ్‌కాఫీ అలవాటు. పనిమనిషి విమల ఉదయం కాఫీ కలిపింది. ఆనంద్‌, గీతాంజలి గదికివెళ్ళి వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి మోహన్‌ గదికి వచ్చింది. అతను గదిలో లేడు. దాంతో అంజలి గది తలుపు తట్టింది విమల.తలుపు తెరుచుకోలేదు. ఈసారి గట్టిగా తలుపు తట్టింది. అయినా తలుపు తెరుచుకోలేదు. ఎంత పిలిచినా, గట్టిగా తట్టినా తలుపు తెరవలేదు అంజలి.

దాంతో విమల భయపడింది. కంగారుగా కేకలుపెట్టింది. కేకలు విని ఆనంద్‌, గీతాంజలి పరుగున వచ్చారు. మాస్టర్‌ కీ తెచ్చి ఆటోమేటిక్‌ డోర్‌ లాక్‌ సిస్టం ఉన్న ఆ గది తలుపులు తెరిచారు.గదిలో బెడ్‌మీద అంజలి అచేతనంగా పడిఉంది. చెల్లెలు శరీరాన్ని తాకి చూసింది గీతాంజలి. చల్లబడిపోయింది. బీరువా తెరచిఉంది. అందులో వస్తువులన్నీ చెల్లాచెదురై ఉన్నాయి. లాకర్‌ లోని నగలపెట్టె ఖాళీగా ఉంది. అందరూ షాక్‌ అయ్యారు. గీతాంజలి పెద్దగా ఏడ్వసాగింది.ఆనంద్‌ పరుగునవెళ్ళి పొరుగునున్న డాక్టర్‌ను పిలుచుకొచ్చాడు. ఆయన అంజలిని పరీక్షించాడు. విషం తాగటంవల్ల మరణించివుండొచ్చని, ఇది పోలీస్‌కేసని చెప్పాడు.ఆనంద్‌ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌చేశాడు.

ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌ అరగంటలోనే తన బలగంతో ఆ బంగళాకు చేరుకున్నాడు. మృతురాలిని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆమె శరీరం నీలంగా ఉంది. దాంతో తన అనుమానం బయటపెట్టకుండా గదంతా పరిశీలించాడు. బీరువా దగ్గరకెళ్ళిచూశాడు. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. లాకర్‌ తలుపు తెరచి ఉంది. లోపల నగలపెట్టె ఖాళీగా ఉంది. ఆ గది కిటికీ తెరచి ఉంది. దానికున్న ఐదు ఊచల్లో ఒకటి లేదు. మరొక ఊచకు ముడివేసిన నైలాన్‌తాడు బయటికి వేలాడుతోంది.