ఆమె నాకు షాపింగ్‌ మాల్‌లో కలిసింది. నా దృష్టి ఆమె మీద పడకపోను. కాని ఆమె సామాన్లు తోపుడు బండిలో వేసుకుని భారంగా నడుస్తోంది. అప్పుడు గమనించాను. ఆమె నిండు గర్భిణి. ఇవాళో రేపో కనేలా ఉంది.పక్కనెవరూ సాయం లేరు.వెంటనే నేనామె దగ్గరగా వెళ్ళి ‘నేను మీకు సాయం చేసేదా?’ అని అడిగాను చిరునవ్వుతో.ఆమె నావేపు చూసింది. నేను వెంటనే ఆమె తోపుడు బండి ఆమె చేతుల్లోంచి తీసుకుని బిల్‌ కౌంటర్‌ వేపు నడిచాను. ఆమె నా వెనకే నడిచింది. ఆమె బిల్లు పే చేసింది.

‘మీతో ఎవరూ రాలేదా?’ అని అడిగాను. ఆమె లేదంటూ తల అడ్డంగా ఊపింది.‘మరి మీరు ఎలా వెళతారు?’ అడిగాను.‘కారుంది...’ అందామె.నేను కారు వరకూ ఆమె సామాన్ల సంచులు పట్టుకుని ఆమె వెనుకే నడిచాను. డ్రైవరు డిక్కీ తీసి సామాన్లు అందులో పెట్టాడు. ఆమె కారు ఎక్కుతూ ‘థాంక్స్‌’ అంది చిరునవ్వుతో, ఆమెని తీసుకుని కారు వెళ్ళిపోయింది.ఇది జరిగిన మూడు నెలలనుకుంటాను. మళ్లీ అదే షాపింగ్‌ మాల్‌లో ఆమె కలిసింది.ఈమారు ఆమె నన్ను పలకరించింది ‘బాగున్నారా’ అంటూ, నేను గుర్తుపట్టలేదు ఆమెని. ‘సుమారు మూడు నెలల క్రితం ఇదే షాపింగ్‌మాల్‌లో మనం కలిసాం గుర్తులేదా’ నవ్వుతూ అడిగింది. ‘సారీ క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు’ అన్నాను నేను.

‘మీరు నా తోపుడు బండి బిల్‌కౌంటరు వరకూ తోసుకువెళ్ళి ఆ తరువాత మా కారు వరకూ నా సామాన్లు మోసుకు వచ్చారు’. ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేసింది. అయినా నాకు గుర్తుకు రాలేదు. ‘అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. బిల్‌కౌంటరు వద్ద నా చున్నీ జారిపోయింది. నేను నేలమీంచి నా చున్నీ తీసుకునే ప్రయత్నం చేసాను. నా వల్ల కాలేదు. అప్పుడు మీరు తీసి ఇచ్చారు’ అంటూ గుర్తుచేసింది.అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఆ రోజు సంఘటన. ‘ఆ అవును ఇప్పుడు గుర్తుకొచ్చింది సారీ అండీ, మరోలా అనుకోకండి’ అన్నాను నేను. ‘ఇందులో మీరు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు. నేనే మీకు మరో మారు థాంక్స్‌ చెప్పాలి’ అంది ఆమె నవ్వుతూ.