అడవిదాటి వచ్చాడతను. అతడితోపాటే ఆమె. సెక్యూర్డ్‌ లైఫ్‌! ఇప్పుడతను నిశ్చింతగా నిద్రపోతున్నాడు. కాకపోతే అడవితనాన్ని కోల్పోయాడంతే! కానీ ఆమెకు ఆ నిశ్చింతలేదు. ఆ నిద్రాలేదు. మనోసంఘర్షణలో కొట్టుమిట్టాడుతోందామె. ఆవేదన పట్టిపీడిస్తోంది. అడవితనం ఆమెను వెనక్కులాగుతోంది. కింకర్తవ్యం అని ప్రశ్నిస్తోంది. ఆ రాత్రి తెల్లారిందా? ఆమె ఏం చేసింది?

దిగ్గున లేచాను ఎవరో తట్టిలేపినట్టు. అర్ధరాత్రి దాటి రెండుగంటలైందని స్మార్ట్‌ఫోన్ చెప్తోంది. గదిలో బెడ్‌లైట్‌ కాంతి మత్తుగా పరుచుకుని ఉంది. ఫ్రిజ్‌లోంచి బాటిల్‌తీసి నీళ్ళు తాగినా దాహం తీరలేదు. బాత్రూంకి వెళ్ళొచ్చి కళ్ళుమూసుకున్నా. కనుల కొమ్మలమీద కునుకుపిట్ట వాలడంలేదు. పక్కనే అతను. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ, అదృష్టవంతుడు, సెక్యూర్డ్‌ స్లీప్‌, మధ్యలో బాబూ అమాయకంగా.... కలలో నవ్వుకుంటూ.ఈ మధ్యంతా ఇలాగే జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయాల్లో మెలకువ వచ్చి ఆ తర్వాత నిద్ర పట్టడంలేదు. నా నిద్రని నా నుండి దూరం చేసిందేమిటి? కలా? ఇంకేమైనానా? ఏదో భరించలేనిది గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను, సాధ్యం కాలేదు.కానీ....‍అతనన్నమాట గుర్తుకొచ్చి మనసు చివుక్కుమంది.

కొన్నిరోజులక్రితం... టౌన్‌లో గిరిజన ఉద్యోగులందరూ ఒక సంఘంగా ఏర్పడి వనభోజనాలు ఏర్పాటుచేసుకున్న పిక్నిక్‌రోజు, పిల్లలూ యువకులంతా స్టేజిమీద డ్యాన్స్‌ చేస్తుంటే ఉత్సాహం ఆపుకోలేక నేనూ రెండు స్టెప్పులేశాను. అది కోపం తెప్పించింది అతనికి. పెళ్ళైన వాళ్ళెవరూ ఆ పనిచెయ్యలేదనీ, నీవెందుకలా చేశావనీ దెప్పిపొడుస్తూ... ఆ మాట అనేశాడు నవ్వుతూనే.పెళ్ళైతే? ఆటలు మానేయాలా? ఆపుకోలేని ఆనందంవస్తే అణుచుకునే ఉండాలా? ఎంత టౌనైతే మాత్రం? అదే మా ఊరైతే? ఒక దానిమీద మరొకటి ప్రశ్నలన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను నిద్రనుండి మరింత దూరం చేస్తున్నాయి.టౌను.పెళ్ళై ఎనిమిదేళ్ళు. ఆరేళ్ళబాబు. వాడు బుడిబుడి అడుగులేస్తున్నప్పుడనుకుంటా, ఉద్యోగం చేసేచోటే కాపురం ఉండాలంటే ఇక్కడికొచ్చేశాం. బాబు ముద్దుముద్దు మాటలాడుతున్నంత వరకూ ఊరెళ్ళివస్తూ ఉండేవాళ్ళం. హఠాత్తుగా ఊరెళ్ళడం తగ్గించేశాం. ఎందుకో ఎప్పటి నుండో గుర్తుకు రావడంలేదు. కానీ ఓరోజు ఊళ్ళో పిల్లలతో బాబు ఆడుకుంటుంటే వీధిలో అందరూ ముద్దుముద్దుగా చూస్తున్నారు అరుగుల్లోంచి.‘‘నీ ముక్కేదీ?’’ పిల్లలడుగుతున్నారు.