ఆఫీసు అవగానే ఐదింటికి కొంపకిచేరే మగాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. ఆ కోవలోని మగాళ్ళలో మా సుబ్బారావు ముందుంటాడు. మగాడు తిరక్కచెడ్డాడు...అన్నమాట సుబ్బారావుకి ఎంతమాత్రం వర్తించదు. ఎందుకంటే వీడు తిరగకపోయినా చెడిపోలేదు. సుబ్బారావు పేరెంత సంప్రదాయంగా ఉందో, మనిషి అంత సంస్కారవంతంగా ఉంటాడు. ఉదయం పదిగంటలకు ఆఫీసుకెళ్తే టంచనుగా ఐదుగంటలు కొట్టేసరికి ఇంటిదగ్గర ఉంటాడు. గ్రహాలు గతులుతప్పినా సుబ్బారావు టైం టేబుల్‌లో మాత్రం మార్పు ఉండదు.

‘‘స్కూలు కుర్రాడిలా ఐదింటికల్లా ఇంటికెళ్లాలని ఏడుస్తావేంట్రా? లేడీస్‌లాగా నాలుగున్నరకే బ్యాగ్‌ సర్దేసి ఐదింటికి కొంపకిచేరితే మగాడికి వెయిట్‌ ఉండదు’’ అని చెప్పినా వినిపించుకునేవాడు కాదు.‘‘ఐదు దాటితే మీ ఆవిడ ఇంటికి రానివ్వదా’’ అని కొలీగ్స్‌ జోకేసినా పట్టించుకునేవాడు కాదు.అందరి మొగుళ్ళలా ఆఫీసయ్యాక అడ్డమైన తిరుగుళ్ళూ తిరక్కుండా ఐదింటికల్లా భర్త ఇంటికి వచ్చేయడం, ‘శ్రీవల్లిసన్నిధి, అదేనాకు పెన్నిధి..’ అని కొంగట్టుకుతిరగడం శ్రీవల్లీకి తెగనచ్చేసింది. ‘ఆహా నా మొగుడే. నా ఆధార్‌కార్డ్‌’ అని వరసకలుపుతూ మురిసిపోతూ ఉండేది.అక్కడితో ఆగకుండా ఇంటికి వచ్చిన ప్రతివారికి ‘బ్రేకింగ్‌ న్యూస్‌’లా, ‘‘మా ఆయన ఐదింటికే ఇంటికొచ్చేస్తారు తెలుసా...‌!’’అని దేశానికి స్వతంత్రం తెచ్చిన లెవెల్లో పనిగట్టుకునిమరీ గొప్పగా చెబుతూ ఉండేది.

శ్రీవల్లిసుబ్బారావుల కాపురం ఇంతచక్కగా, సజావుగా సాగడం పక్కింటిపంకజానికి ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే సీరియల్స్‌ విషయంలో పంకజానికి, అత్తగారికి భేదాభి ప్రాయాలున్నాయి. ఒకరికి నచ్చిన సీరియల్‌ మరొకరికి నచ్చదు. మొగుడు అమ్మకూచి, ఇంట్లో అత్తగారిదే పెత్తనం కాబట్టి తనకు కావాల్సిన సీరియల్‌చూసే అవకాశంలేక సరిగ్గా ఆ టైమ్‌కే శ్రీవల్లి ఇంటికొచ్చే‍సేది. ఇది పంకజానికి బాగా వర్కవుట్‌ అయింది. కానీ శ్రీవల్లికి పెళ్ళయ్యాక సుబ్బారావు ఇంటికి త్వరగా వచ్చేయడంతో ఆ టైముకి వచ్చే సీరియల్స్‌కి స్పీడ్‌బ్రేకర్లా అడ్డుపడ్డాడు. అందుకే ‘ఏదోఒకటిచేసి, తన సీరియల్‌కి అడ్డురాకుండా సుబ్బారావుని ఎలా కట్‌చెయ్యాలా...’అని సీరియస్‌గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది పక్కింటి పంకజం. అందులో భాగంగా.....