విదర్భదేశాన్ని క్షామం పట్టిపీడిస్తోంది. వర్షాలు లేవు. పంటలు పండటంలేదు. ప్రజలు ఆకలితో వలసలు పోతున్నారు. రాజు దేశాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఒకవైపు క్షామం పట్టిపీడిస్తుంటే, ఒక సామాన్య బ్రాహ్మణుడు మాత్రం విరివిగా దానధర్మాలు చేస్తున్నాడు. అతడింట ఎంతోమంది భోజనం చేసి వెళుతున్నారు. ఇది విని రాజు మారువేషంలో వెళ్ళాడు. అతడింట అక్షయపాత్ర చూశాడు. రాజు దానిని స్వాధీనపరుచుకున్నాడా? ఇంతకీ అక్షయపాత్ర వెనుకున్న అసలు కథేమిటి?

********************

పూర్వం విదర్భదేశంలో వానలుపడక క్షామం వచ్చింది. తిండి సంగతి అటుంచి, నీటి కోసమే ఉన్న ప్రాంతాలు వదిలి ఎక్కడెక్కడికో వలస పోసాగారు ప్రజలు. అలాంటివారిలో నిష్కాముడనే బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు.నిష్కాముడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని వంటబట్టించుకున్న అతడు - విద్యకోసం తన ఇంటికి వచ్చిన వారందరికీ ఉచితంగా చదువు చెప్పేవాడు. అతడికి వారసత్వంగా సంక్రమించిన యాభై ఎకరాల భూమి ఉన్నది. దానిమీద వచ్చే ఆదాయంతో తాను సుఖంగా బ్రతకడమే కాక, విరివిగా దానధర్మాలు కూడా చేస్తూండేవాడు. ఇప్పుడు క్షామంవల్ల పొలంలో పంటలు లేవు. ఐనా ఇంట్లో నిలవున్న పంటధాన్యాల్ని దాచుకోకుండా పదిమందికీ పంచిపెట్టి ఆదుకున్నాడు. కానీ అలా ఎన్నాళ్లు? చివరకి నిష్కాముడికీ తిండిలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడతడు తన భార్య సుమతితో, ‘‘ఇదీ ఒకందుకు మంచిదే. కొంతకాలం, ఇతరుల ప్రమేయం లేకుండా అరణ్యంలో ఆశ్రమవాసం చేస్తూ తపస్సు చేసుకోవాలని నా కోరిక. నేను అడవికి వెడతాను. ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి వస్తాను. అంతవరకూ, నీవు పిల్లలతో వెళ్లి నీ పుట్టింట ఉండు’’ అన్నాడు.

నిష్కాముడి అత్తవారు కలిగినవారు. జాగ్రత్తపరులు కావడంవల్ల క్షామం వచ్చినా వారికి తిండికి లోటు లేదు. వారికి ఎప్పుడైనా కన్నకూతుర్ని ఆదరించగల శక్తీ ఉంది, ప్రేమాభిమానాలూ ఉన్నాయి. కానీ సుమతి భర్తతో, ‘‘నాథా! నాకు మీ తోడిదే లోకం. మీరు కూడా నాతో వచ్చే మాటైతేనే నేను మా పుట్టింటికి వెడతాను’’ అన్నది.‘‘చెడి అత్తవారింటికి వెళ్లడం మగవాడికి తగదు’’ అని నిష్కాముడు కుటుంబ సమేతంగా సమీపారణ్యానికి వెళ్లాడు. అడవిమధ్యలో వారొక కుటీరం చూశారు. అందులో ఏ మునీశ్వరుడో ఉంటాడనుకున్నాడు నిష్కాముడు. తనవారిని బయట ఎదురుచుస్తూండమని చెప్పి తను లోపలకు వెళ్లి చూస్తే, ఆశ్చర్యంగా అక్కడ మంచంమీద ఒక రోగిష్టివాడు పడుకుని మూలుగుతున్నాడు. బాగా నీరసంగా ఉన్నాడేమో అతడి మూలుగు కుటీరం దాటి బయటకు రావడంలేదు. నిష్కాముడతణ్ణి సమీపించి, ‘‘అయ్యా! నీవెవరు? ఇక్కడ నీ వాళ్లెవ్వరూ లేరా?’’ అనడిగాడు. బదులుగా అతడు దాహం వేస్తున్నదని సైగ చేశాడు నీరసంగా.