ఆవిడ చేతి మహాత్మ్యం అలాంటిది. మూకుట్లో జంతికల గొట్టం తిప్పితే మురుకులు గుల్లబారుతాయి. కమాను ఆడిస్తూ, ఫిడేలు తీగెలు మీటితే రాగాలు శ్రుతిలో ఒదిగుతాయి. మునివేళ్ళు ఒడుపుగా కదిలిస్తే మట్టి ముద్దలు బొమ్మలవుతాయి. సాదరంగా సాయం చేస్తే జీవితాలు ఒడ్డునపడతాయి. అంబుజమ్మగారంటే సృజన, అలుపెరుగని సాధన, మంచితనం ఉట్టిపడే మానవీయ స్పందన!

బెలగాం అగ్రహారం వీధిలో శ్రావణమాసం అడుపెట్టగానే శరన్నవరాత్రుల సందడి మొదలయేది! డాక్టర్ వెంకోబరావుగారింట్లో దసరా బొమ్మల కొలువు ఏర్పాట్లు ఊపందుకునేవి. ఎక్కడో, ఎవరో తయారు చేసిన బొమ్మల్ని మెట్లమీద పేర్చినట్లు కాకుండా, ఏడాదికో ఇతివృత్తం ప్రకారం డాక్టర్గారి శ్రీమతి అంబుజమ్మగారు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మట్టి బొమ్మలు కొలువుదీరేవి. వాటికి ఆ ఇంటి పెరటి వరండా పురిటిగది అయితే, మేడమీద హాలు ఉయ్యాలతొట్టెగా మారిపోయేది. బారులు తీరిన బొమ్మలతో కంటికీ, కరకరలాడే రుచులతో నోటికీ విందులు జరిగేవి.శ్రావణం మొదలు కావడం ఆలస్యం, పొట్టిగాడి జట్కా పార్వతీపురం టౌన్ లోని కుమ్మరి వీధికి పరుగు తీసేది. సంచులతో పొడి బంకమన్ను తీసుకొచ్చేది. పొట్టిగాడి తల్లి సింహాచలమ్మ వాటిని డాక్టర్‌గారి పెరటి వరండాలో గుమ్మరించి, మట్టి గడ్డల్ని సుత్తితో విడగొట్టేది.

గులకరాళ్ళనీ, గడ్డీ గాదరనీ వేరు చేసి, పొడిమట్టిని జల్లెడ పట్టేది. కాటుకలాగా మెత్తగా దిగిన మట్టిని కుప్పగా పోగుచేసి, కొలత ప్రకారం అందులో నీళ్ళు పోసేది. బంక మన్ను బాగా నానిన తర్వాత అంబుజమ్మగారు రంగంలోకి దిగేవారు. బ్రహ్మదేవుడు మట్టిబొమ్మల్ని ఎలా చేస్తాడో తెలియదుగానీ, అంబుజమ్మగారిని చూసిన వారికి మాత్రం ఆవిడ నైపుణ్యంలో బ్రహ్మదేవుడు కనిపించేవాడు. ఎన్నెన్ని బొమ్మలో, అవెన్ని రకాలో! దేవీ దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు, పక్షులు... ఊపిరి లేదన్నమాటేగానీ, స్వర్గం నుంచి భూమి వరకు సృష్టి సమస్తం అంబుజమ్మగారి వేలి కొసల్లో ఊడిపడేది. ఊహాలోకాలు మొదలుకుని వాస్తవ ప్రపంచం దాకా సృజనలోని వైవిధ్యం ఆ బొమ్మల వరసల్లో ఉట్టిపడేది.అంబుజమ్మగారికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంది.

రోజూ సాయంత్రం వారి మేడమీద గదిలో వాయులీనం సాధన చేసేవారు. కన్నడ రుచులు కలబోసి అద్భుతమైన వంటకాలు చేసేవారు. మంగుళూరు కాఫీ గింజల్ని దోరగా వేయించి, చేత్తో తిప్పే గ్రైండర్ లో పొడి చేయించి చిక్కటి కాఫీ తయారు చేసేవారు. పంచుకునే గుణం, సాటి మనిషి తృప్తిపడితే సంతోషించే నైజం, తల్లిలాంటి మనసు...ఇవన్నీ ఆవిడ బొమ్మల తయారీలోనూ, కొలువు దీర్చడంలోనూ కనిపించేవి. తడి ఆరిన ప్రతీ బొమ్మనూ అక్కున చేర్చుకునేవారు. లాలనగా రంగులు వేసేవారు. దుస్తులు అమర్చేవారు. అమ్మవారి కళ్ళలో రౌద్రాన్నీ, ఆవిడ పాదాల కింద మహిషాసురిడి మొహంలో భయాన్నీ ఒకే రకమైన శ్రద్ధతో తీర్చిదిద్దేవారావిడ.