తండ్రి అనుకున్నస్థాయిలో కొడుకు చదువులో రాణించడంలేదు. కేవలం ఎ గ్రేడ్‌ మార్కులు. పోటీ ప్రపంచంలో ఆ మార్కులు చాలవు. అందుకే కొడుకుని ఇంకా మంచిస్కూల్లో చేర్పించాడు. అక్కడ కూడా అతడి గ్రాస్పింగ్‌ పవర్‌ సరిపోలేదు. ప్రోగ్రెస్‌కార్డులో అన్నీ రిమార్కులే. ప్రోగ్రెస్‌ కార్డుపై తండ్రి సంతకం చేయించాలి. కానీ ఎలా? తండ్రి అంటే ఆ కొడుక్కి విపరీతమైన భయం. చివరకు ఆ కొడుకు ఏం చేశాడు?

సైలెంట్‌ మోడ్‌లో ఉన్న మొబైల్‌ రెండుసార్లు మోగింది. ఇంట్లో పిల్లలకు వీణపాఠాలు చెబుతున్న అమృతవర్షిణి చూసుకోలేదు. ‘‘ఆంటీ మొబైల్‌ మోగుతోంది’’ ఓ స్టూడెంట్‌ చెప్పగానే అమృతవర్షిణి ఫోన్‌ అందుకుంది. ‘‘మేడం నేను టెక్నోస్కూలు నుంచి మాట్లాడుతున్నాను. అర్జంట్‌గా రండి. మీ అబ్బాయి బిలహరికి హైఫీవర్‌. వామ్టింగ్స్‌ చేసుకుంటున్నాడు’’ అన్నాడు అవతలి వ్యక్తి. ట్యూషన్‌ పిల్లల్ని పంపించేసి ఆటోలో టెక్నోస్కూల్‌కు వెళ్ళింది అమృతవర్షిణి. బిలహరిని తీసుకుని తోవలోనేఉన్న తమ ఫ్యామిలీ డాక్టర్‌ మూర్తిగారికి చూపించింది. ఆయన వెంటనే బిలహరిని హాస్పిటల్లో అడ్మిట్‌చేసుకుని సెలైన్‌పెట్టారు. రెండురోజులు హాస్పిటల్‌లోనే ఉంచమన్నారు.

సమయానికి తన భర్త వాసు ఊళ్ళోలేడు. అదేరోజు ఉదయం ఫ్లైట్‌లో బాస్‌తోకలిసి దుబాయి వెళ్ళాడు. మూడువారాలు క్యాంప్‌. వాసుది తరచు క్యాంపులువెళ్ళే ఉద్యోగం. అందువల్ల పిల్లల్ని చూసుకోవడం అమృతవర్షిణికి అలవాటే. కానీ ఆరోజు పరిస్థితివేరు. బిలహరి హాస్పిటల్‌ బెడ్‌మీద కలవరిస్తున్నాడు. నిద్రలో ఉలికిపడుతున్నాడు. భయంతో ముడుచుకుపోతూ ఏడుస్తున్నాడు. ఎప్పుడూ లేనిది అమృతవర్షిణికి ఆ క్షణంలో భయం వేసింది. ‘‘పసివాడు. దేనికో భయపడ్డాడు. ధైర్యంగా ఉండండి, మందులువాడితే సర్దుకుంటుంది’’ డాక్టర్‌ మూర్తి ధైర్యం చెప్పారు.కుర్చీని బెడ్‌కి దగ్గరగా జరిపి కూర్చుంది అమృతవర్షిణి. ఆమె ఒడిలో బిలహరి స్కూల్‌ బ్యాగ్‌ ఉంది. సగందాకా తెరుచుకున్న జిప్‌లోంచి బయటకు తొంగిచూస్తూ టెక్నోస్కూల్‌ ‘వీక్లీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’. కార్డ్‌ బయటకుతీసి చూసింది అమృతవర్షిణి.

మార్కులూ, రిమార్కులూ చూసింది. పేరెంట్‌/గార్డియన్‌ సిగ్నేచర్‌ కాలమ్‌చూసి గట్టిగా నిట్టూర్చింది. పన్నెండేళ్ళ క్రితం....అమృతవర్షిణికి రెండోకాన్పులో అబ్బాయిపుట్టినప్పుడు ‘‘హరి అని పిలుద్దాం, మా నాన్న పేరు’’ అన్నాడు వాసు. అమృతవర్షిణి మరో రెండు అక్షరాలుచేర్చి ‘బిలహరి’ అంది. నవ్వాడు వాసు. పేరు కొత్తగా అనిపించింది. అదేదో రాగం పేరై ఉంటుందనీ, తన అర్థాంగి అలాంటి మెలికేదో పెడుతుందనీ అనుకుంటూనే ఉన్నాడతను. తొలికాన్పులోనూ ఇదే తంతు. అమ్మాయి పుట్టింది. ‘‘గౌరి అని పిలుద్దాం.. మా అమ్మ పేరు’’ అన్నాడు వాసు. అమృతవర్షిణి అదనంగా మరో నాలుగు అక్షరాలు చేర్చింది. ‘గౌరీ మనోహరి’ అని రాగంపేరు పెట్టుకుంది!