మధ్యాహ్నం ఒంటిగంట వేళ...లాయర్ లక్ష్మాజీరావు గారింట్లో ఆందోళన! పదేళ్ళ శీనుబాబు కనిపించటం లేదు. ఇంట్లోని పదహారు గదులూ వెదికారు. ఎక్కడా లేడు. ఎటు వెళ్ళాడో తెలీదు. ఉదయం ఏడుగంటలకే ఆకలన్నాడు. ఇడ్లీ కావాలన్నాడు. అగ్రహారం వీధిలోనే రెండిళ్ళకి అవతల శ్రీనివాసరావు హోటలు నుంచి రెండు ఇడ్లీలు తెప్పించారు. అవి తిని పాలు తాగిన శీనుబాబు ఎక్కడికి వెళ్ళాడో?మధ్యాహ్నం ఒంటి గంటవుతున్నా ఇంటికి రాలేదు.

శీనుబాబుకి వారంరోజులపాటు విపరీతమైన జ్వరం. ఒకటే కలవరింతలు. లంఖణాలు చేయటంవల్ల పిల్లడు పీక్కుపోయి, పుల్లలా ఐపోయాడు. రెండు రోజులక్రితం టెంపరేచర్ ‘నార్మల్’కి వచ్చింది. నిన్ననే పథ్యం పెట్టారు. శీనుబాబు వాళ్ళ అమ్మమ్మ నారాయణమ్మ తిరగలిలో బియ్యం విసిరింది. నూక పట్టింది. దోరగా వేయించి, పలచటి జావ చేసింది. అందులో కమ్మగా నెయ్యి వేసి, వేడి చారుపోసి, మెత్తగా గుజ్జులా కలిపింది. నంజుకోడానికి పాత మాగాయ ముక్క వేసింది. ఆవురావురని తిన్నాడు శీనుబాబు. తిన్న వెంటనే ఆవలింతలు. కళ్ళు బరువెక్కాయి. నిద్రపోకూడదట. బయటకి వెళ్ళకూడదట. మళ్ళీ జ్వరం వస్తుందన్నారు. అందువల్ల ఆ మాటా ఈ మాటా చెబుతూ శీనుబాబుని రోజంతా కూర్చోబెట్టారు.

శీనుబాబు వాళ్ళ జున్నక్కయ్య పొరుగున బండారు వారింట్లోనే ఉంటుంది. ఆవిడ భర్త సంజీవరావుగారు కూడా అడ్వొకేటే. లాయర్ లక్ష్మాజీరావుగారికి అసిస్టెంట్. జున్నక్కయ్యకి థర్మా మీటర్ చూడడటం వచ్చు. ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగులేకపోయినా, థర్మా మీటర్‌ చూడటం, జగ్గునాయుడు రిక్షా మీద గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ లక్ష్మిగారికి చూపించడం జున్నక్కయ్య డ్యూటీలే. ముందురోజు పథ్యం పెట్టిన తర్వాత కూడా ఆవిడ గంట గంటకీ వచ్చి శీనుబాబుకి జ్వరం చూసేది. చూసిన ప్రతీసారీ ‘నార్మల్’ అనేది. అది వినగానే నారాయణమ్మ, ‘‘అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దయవల్ల పిల్లడికి తెరిపిచ్చింది’’ అంటూ దండాలు పెట్టేది.