అతనికి చూపు లేదు. ప్రాణసంకటంలో ఉన్నాడు. అయినా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అందులోనుంచి బయటపడాలంటే మాత్రం అతనికి ఒకే ఒక్క ఛాన్స్‌ ఉంది. ఆ ఛాన్స్‌ మిస్‌ అయ్యాడంటే అతను ప్రాణాలు కోల్పోవటం తథ్యం. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోతారు. మరి అతను తనను తాను కాపాడుకోవడానికి ఏంచేశాడు? మృత్యుముఖం నుంచి ఎలా బయటపడ్డాడు?

ఆ రాత్రి పుచ్చపువ్వులాంటి పున్నమి వెలుతురు ఆ సిటీలోని తారు రోడ్లను తనవంతుగా మెరిపిస్తూ ఉంది. యథాశక్తి తాము కూడా రోడ్డుని తమ పసుపురంగు కాంతితో ప్రకాశ వంతం చేస్తున్నాయి, రోడ్డు మధ్యలో స్తంభాలపై వెలుగుతున్న హేలోజన్‌ దీపాలు! సమయం పన్నెండు దాటడంతో రోడ్డు మీద ట్రాఫిక్‌ బాగా పలచబడింది. అప్పుడప్పుడు, ఝామ్మంటూ వెళ్ళే కార్లు తప్ప నరసంచారం పెద్దగా లేదు.చాలావరకు నేరాలు జరిగేది రాత్రి సమయాలలోనే. మోసాలకు, దారి దోపిడీలకు, నమ్మించి గొంతు కోయడానికి, చాటుమాటు వ్యవహారాలకు కూడా రాత్రి సమయమే వేదిక! కొన్ని నేరాలు కంటికి కనబడతాయి. కొన్ని కన్ను పసిగట్టలేని విధంగా ఉంటాయి. చూసినదంతా నిజం కాదు, అలా అని నిజం బాహాటంగా కనిపిస్తుందా అంటే అదీలేదు.

ఒక్కోసారి అసలు నిజం చూపులకు అందదు!అది నగరంలోని పోష్‌ ఏరియాలలో ఒకటి. రాత్రి సమయాలలో గస్తీ తిరగడానికి పోలీసుల పెట్రోలింగ్‌ వెహికల్‌ ఒకటి అప్పుడప్పుడు రౌండ్లు కొడుతోంది, తాపీగా! ఆరోజు ఏదో పండగ కారణంగా చాలామంది సెలవులు పెట్టారు. ఆ కార్‌లో పెట్రోలింగ్‌ డ్యూటీ చేయవలసిన ముగ్గురిలో విక్రమ్‌ ఒక్కడే ఉన్నాడు. పెట్రోలింగ్‌ వెహికల్‌ ఇన్నోవా కావడంతో సౌకర్యవంతమైన సీట్లు! చేసే ఉద్యోగం కష్టమైనదైనా వీలున్నంత సుఖంగా చేయడానికి కావలసిన పరిస్థితులను కల్పిస్తున్నారు పై అధికారులు. అందువలన పనిచేసేటప్పుడు ఇది వరకు చిరాకుగా ఉండే పోలీసులు ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు నగర పౌరులతో! ఇస్మాయిల్‌ మెల్లగా డ్రైవ్‌ చేస్తూ ఏవో ఆఫీస్‌ పాలిటిక్స్‌ చెప్తున్నాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌తో.