అలవాటు ప్రకారం ఉదయాన అయిదున్నరకి మెలకువ వచ్చింది. కిటికీలోంచి చూసేసరికి మా ఇంటి ఎదురుగా రెండు అపార్టుమెంట్ల మధ్యలో ఉన్న కూరగాయల షాపుముందు అప్పటికే అయిదారుగురు నిలబడి ఉన్నారు. ప్రతిరోజు అది మామూలే. తెల్లవారుతున్నప్పటి నుంచి సాయంత్రంవరకు ఎవరో ఒకరు ఆ షాపుకి వస్తూపోతూ ఉంటారు. షాపుకి కొంచెం దూరంలో మోటార్ ‌సైకిల్‌ పక్కన నిలబడి ఒకతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని ఎదురుగా మరోవ్యక్తి, ఎదురుగా ఉన్న వ్యక్తితో ఏదో సంజ్ఞచేస్తూ చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి మోటార్‌సైకిల్‌ ఎక్కి ఏదో తొందర పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు.చిన్న వాన్‌ వచ్చి కూరగాయల షాపు ముందు ఆగింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి సహాయంతో వాన్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, సుమారు ఇరవై కుర్చీలు దింపి రోడ్డుప్రక్కన వరుసలో పేర్చారు.

ఆ తర్వాత చిన్నషామియానా ఏర్పాటుచేశారు.ఆ కూరగాయలషాపు ఒక పెద్దపాక. ముందు సగభాగంలో కూరగాయలు, మధ్యలోదడి, వెనకభాగంలో వాళ్ళ సంసారం. ఆ షాపుయజమాని ప్రకాశం. అతనికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. కూతురికి పద్దెనిమిది సంవత్సరాలుంటాయి. కొడుకులిద్దరీకి సుమారు పదీ, పదకొండు సంవత్సరాలుంటాయి.రోజూ ఉదయాన్నే వాన్‌ వచ్చి ఆగుతుంది. ప్రకాశం, కూతురు వచ్చి కూరగాయలు దింపుకుంటారు. అంతలో కొడుకులిద్దరూ బయటకు వస్తారు. అలవాటుప్రకారం నలుగురూ కలిసి ఏ కూరలు ఎక్కడసర్దాలో, అక్కడ చకచకా సర్దేస్తారు.

ఏ తడబాటు ఉండదు. యాంత్రికంగా జరిగిపోతుంది.తర్వాత ముగ్గురుపిల్లలూ తయారై స్కూల్‌కి వెళ్ళిపోతారు. ప్రకాశంభార్య వచ్చి కొట్లోకూర్చుంటుంది. అప్పటిదాకా కొనుగోలుదారులకి అవసరమైన కూరగాయలు ఇచ్చి ప్రకాశం లోపలికి వెళ్ళిపోతాడు. కూరగాయలన్నీ అప్పుడే కోసినట్లు నవనవలాడుతూ ఉంటాయి. అప్పుడే మొదలైన అమ్మకం సాయంత్రంవరకూ సాగుతూ ఉంటుంది.ఈ కాలనీలో ప్రకాశం పరిచయంలేని ఇల్లు ఉండదేమో!