‘‘ఈసారి మన వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎవర్ని పిలుద్దామంటారు?’’ అన్నాడు ప్రవీణ్‌ కుమార్‌.‘‘ఈ మధ్య మనసభలకు ఎక్కువమంది రావడంలేదు. ఎక్కువమంది రావాలంటే ఎవరైనా సినిమారంగానికి సంబంధించినవాళ్ళను ముఖ్యఅతిథిగా పిలిస్తే బాగుంటుందేమో!’’ అన్నాడు ఆ సమావేశంలో ఉన్న ఈసీ మెంబర్‌ రఘురాం.

అది ఉజ్వల సాహిత్యసంస్థవారి కార్యనిర్వాహక సమావేశం (ఈసీ మీటింగ్‌) గత 20 సంవత్సరాలుగా ఈ సంస్థ వరంగల్‌ నగరంలో అనేక సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు నిర్వహిస్తున్నది. నగరంలో ఈ సంస్థకు చాలా మంచిపేరు, గుర్తింపు ఉన్నాయి. వీరు నిర్వహించే ఏ కార్యక్రమమైనా చాలా వినోదభరితంగా, విజ్ఞానదాయకంగా ఉంటుందని ఆ ఊర్లో అందరికీ తెలుసు. ఈ సంస్థ నిర్వహించే ఏ కార్యక్రమమైనా ముఖ్యంగా వార్షికసమావేశాలకు నాలుగైదువందలమంది శ్రోతలు తప్పకుండా వస్తుండేవాళ్ళు. అలా వచ్చిన శ్రోతలంతా నిశ్శబ్దంగా చక్కని క్రమశిక్షణతో కార్యక్రమాలు చూస్తుండేవారు. అయితే ఇటీవలి కార్యక్రమాలకు వచ్చే శ్రోతల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నదని ఆ సంస్థ నిర్వాహకులు గమనించారు.

ఎక్కువమంది రావాలంటే ఏం చెయ్యాలి? అనే అంశాన్ని గూర్చి ఆలోచించడానికే ఈ సమావేశాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు డా.ప్రవీణ్‌కుమార్‌ ఏర్పాటుచేశాడు.‘‘సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళను పిలవడం, వాళ్ళు రావడానికి అంగీకరించటం చాలాకష్టం. అందులో సినిమావాళ్ళకు చాలా డబ్బులివ్వడమో, చాలా విలువైన కానుకలివ్వడమో చెయ్యకపోతే వాళ్ళు రారు...’’ అన్నాడు ప్రవీణ్‌.‘‘నాకు ఒక ఫేమస్‌ సినిమా డైరెక్టర్‌ తెలుసు. ఆయనను తీసుకురమ్మంటే నేను తీసుకొస్తాను’’ అన్నాడు ఆనందరావు, మరో కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు.‘‘ఎవరా డైరెక్టర్‌?’’ అన్నాడు మరో ఈసీ మెంబర్‌ వినోద్‌కుమార్‌.