ఎంటెక్‌ పూర్తిచేసి ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరిందామె. ఒక ఫంక్షన్‌లో ఆమెను చూసిన ఓ అబ్బాయికి తెగ నచ్చేసిందామె. ఇద్దరిమధ్యా మెల్లిగా ప్రేమకలాపం ప్రారంభమైంది. ఆమెను అతడింటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటికి ఉన్న నేమ్‌ప్లేట్‌ చూసి విస్తుపోయింది. మళ్ళీ ఊరట చెందినప్పటికీ ఆ తర్వాతి సంఘటనలు ఆమె మూడ్‌ను పాడుచేశాయి. ఇంతకీ ఏమిటా సంఘటనలు? అసలు ఆ నేమ్‌ప్లేట్‌మీద ఏమని ఉంది?

‘‘నా మూడేం బాగాలేదు’’ ఆ రోజు బహుశా ఇరవయ్యోసారి అనుకుంది ఇందుమతి.‘‘హలో! ఏమిటీ ఇంకా ఆలోచనలోనే ఉండిపోయావా? అక్కడ మన బస్‌ టైమ్‌ అవుతోంది’’ ఆమె సహోద్యోగి జలజ భుజం తట్టి గుర్తు చేసింది.తత్తరపడి లేచి జలజతో పాటు స్టాఫ్‌ రూం నుంచి బయటకి నడిచింది ఇందుమతి. ఎంటెక్‌ అయ్యాక హైదరాబాద్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. ఈ మధ్య ఆత్రేయ ఆశపెట్టి ఓ సలహా ఇచ్చాడు. ‘‘ఇందూ! నువ్వు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం మారడం సులువు. నాకు అమెరికా ఛాన్స్‌ వస్తే ఇబ్బంది లేకుండా నువ్వూ నాతో వచ్చేసి అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు’’ అన్నాడు. అప్పటి నుంచి సాయంత్రం కాలేజీబస్సులో ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో మైత్రీవనం దగ్గర దిగి గంటసేపు కోర్సులు నేర్చుకుంటోంది.

‘‘నాతో పాటు వచ్చేయచ్చు అని మా బాగా కబుర్లు చెప్పాడుగానీ, ఇప్పుడు అసలు పెళ్ళి అవుతుందో లేదో అనుమానంగా ఉంది’’ అనుకుంది ఇందుమతి. బస్సులో కూర్చుని ఆలోచనల్లో పడింది.ఏడాది క్రితం స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు ఆత్రేయ. మొదటిసారి అతని పేరు విన్నప్పుడు పేరు చిత్రంగా ఉందే అనుకుంది. ఆ మాట చెప్పడానికి మొహమాటపడింది. అయితే ఆమె మనసును చదివినట్లు నవ్వాడు ఆత్రేయ. ‘‘నా పేరు మీకు చిత్రంగా అనిపించవచ్చు కానీ అర్థం ఒకటే’’ అన్నాడు.‘‘ఒకటే అంటే?’’ ఇందుమతి అడిగింది.‘‘ఐ మీన్‌...మన పేర్ల అర్థం దాదాపు ఒకటే.’’ అన్నాడు. ఇంకా ఏదో చెప్పాడుగానీ భజంత్రీలమోతలో సరిగ్గా వినపడలేదు. ఆత్రేయ ఆమెకి బాగా దగ్గరగా ఒంగి ‘‘ఇక్కడ ఇంకో నిమిషం ఉంటే చెవులు బద్దలైపోతాయని అనుకుంటున్నారా?’’ అని అడిగాడు.