‘‘ఏమండి! తెల్లారి చాలాసేపయింది.... లేస్తారా!’’ గోముగా అంది కోమలి బెడ్రూమ్‌లో నిద్రపోతున్న భర్త గోపాల్రావ్‌ను కుదుపుతూ మొదటి ప్రయత్నంగా.‘‘అరె... ఇంకా నిద్ర లేవలేదా... లేవండి!’’ అరగంట తర్వాత వచ్చి ఇంకా అలాగే పడుకుని ఉన్న భర్తను చూసి ఈసారి కొంచెం గట్టిగానే అని వంటగదిలోకి వెళ్ళింది కోమలి.

ఈ కలలరాజుకి మరీ కక్కుర్తి ఎక్కువ. కల్లోకి కూడా నా పెళ్ళాన్నే పంపిస్తున్నట్లున్నాడల్లే ఉంది. కోమలి గొంతులాగానే ఉన్నది. ఏ అనుష్కానో, కాజోల్‌నో, సమంతనో పంపొచ్చుకదా! తియ్య తియ్యగా కబుర్లు చెప్పుకుండే వాళ్ళం... ఇంకా సాంతం మెళుకువరాని స్థితిలో కల–కలకాని స్థితిలో కొట్టుమిట్టాడుతూ అనుకున్నాడు ముసుగుతన్ని పడుకున్న గోపాల్రావ్‌.‘‘ఇంకా నిద్రలోనే జోగుతున్నారా... మంచిగా లేవమని చెబితే ఎందుకు లేస్తారు!’’ అంటూనే గోపాల్రావ్‌ తలమీదుగా కప్పుకున్న దుప్పటిని ఒక్కలాగు లాగుతూ, ‘‘ఎనిమిది గంటలవుతోంది.... నిద్రపోయింది చాలుగాని లేవండి’’ పెద్ద గొంతుకతో అరుస్తున్నట్లే అన్నది కోమలి.‘అయితే ఇందాకటి నుండి కల్లో వినిపిస్తున్నదనుకున్న పెళ్ళాం గొంతు కల్లో కాదన్నమాట.... నిజంగా నేనా’ కోమలి దెబ్బతో కలల సామ్రాజ్యం నుండి ఎవరో ఒక్కసారిగా భూమి మీదకు లాగినట్లని పించింది గోపాల్రావుకు.

‘‘ఎనిమిది గంటలెక్కడయిందీ... ఇంకా ఏడేగా... పొద్దుపొద్దున్నే అబద్ధాలతో మొదలుపెడతావు... అయినా ఈరోజు ఆదివారం నాకు సెలవు. అంత పరుగెత్తుతూ చేసుకోవాల్సిన పనులేం లేవు!’’ అంటూనే కాళ్ళమీదగా ఉన్న దుప్పటిని మీదికి లాక్కున్నాడు. అసలే చలికాలం. మందపాటి దుప్పటి తలనిండా కప్పుకోనిదే నిద్రరాదు. కలలూ రావు. ఛ... మంచిటైమ్‌ చూస్కొనిలేపింది? అనుష్క, కాజోల్‌, సమంత వరసబెట్టి వచ్చి ఉండేవాళ్ళు.

మళ్ళీ ట్రై చేద్దాం... వాళ్ళు కాకపోయినా కనీసం కీర్తిసురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, సురభి అన్నా రాకపోతారా... మనసుని మంచి రొమాంటిక్‌ మూడ్‌లోకి తీసుకెళుతూ అనుకున్నాడు.‘‘అవును అబద్ధం చెప్పాను... లేకపోతే ఏడుగంటలయిందని నిజం చెబితే మీరు లేస్తారా... అయినా అవతల శ్రావణ్‌ని స్పెషల్‌ క్లాసులో దింపాలి, కూరగాయలు తేవాలి, రమ్యను సంగీతం క్లాసుకు తీసుకెళ్ళాలి. వంట చేయటం ఇప్పుడే అవ్వదు కాబట్టి శ్రవణ్‌కు కాలేజీలో లంచ్‌బాక్సు ఇవ్వాలి... ఇంకా...’’