బస్సుకోసం ఎదురుచూస్తున్నారంతా. కానీ అందరి దృష్టీ ఆ ములాడిమీదే! వీణ్ణి బస్సెక్కనీయకూడదు..అదే వాళ్ళ ఆలోచన! అంతలోనే బస్సు హారన్‌ వినిపించింది. బస్సును చూడగానే ఆ ముసలివాడి కళ్ళల్లో వెలుగు. బస్సును అందుకోవాలనే ప్రయత్నం! దూరంగా ఆగిన బస్సువైపు కాలీడ్చుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళు అతడిని బస్సు ఎక్కనిచ్చారా? అసలు అక్కడ ఏం జరిగింది?

బస్సు పైకెళ్ళింది....అది రోజు పొద్దున్నే అయిదింటికల్లా ధూపడం బస్టాండులో బయలుదేరి ఏడున్నరకల్లా వేగులూరు మీదుగా డోర్నాల చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో అక్కడినుంచి వేగులూరు పావుగంటే. కానీ అలా పైకెళ్ళిన బస్‌డ్రైవరూ, కండక్టరూ అక్కడే టిఫిన్లూ, కాఫీలు చేస్తారేమో! వీళ్ళు ఆర్డరిచ్చి, వాళ్ళు తెచ్చి, వీళ్ళు తిని... తాగి ఏ వక్కపలుకో నముల్తూనో, సిగరెట్‌ కాల్చుకుంటూనో వేగులూరు వచ్చేసరికి చాలాసార్లు అరగంటకంటే ఎక్కువే పడుతుంది.వేగులూరు ఊళ్ళో పండే కూరగాయలకి మందులు ఆట్టేవాడరని ధూపడం మార్కెట్‌కి ఆ జిల్లాలోనే పెద్దపేరు. తయారైన కూరగాయలన్నీ ముందురోజు కోసేస్తారేమో ఆయా ఊళ్ళల్లోని మార్కెట్లల్లోకి వెళ్ళేవి వెళ్ళిపోగా ధూపడం రైతుబజార్లో అమ్మాల్సిన బుట్టల్లోనూ, తట్టల్లోనూ, గోనెసంచుల్లోనూ సర్దేసుకుని బస్‌ వచ్చే సమయానికి వంట చేసేసుకుని రెడీగా ఉంటారు రైతులు.

రేకుల డబ్బాలా ఉండే ఆ ఎర్రబస్‌ ఎక్కడో మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాని హారన్‌చప్పుడు పొలాలమీద నుంచి వచ్చే పైరుగాలి పరుగులమీదొచ్చి అందించేస్తూనే ఉంటుంది.బస్సు ఊళ్ళోంచి పైకెల్లింది అనగానే పళ్లాలు వాల్చుతారు అన్నాలు తినటానికి. చెయ్యి కడుక్కుని, నడుం అలా జారేస్తారో లేదో...హారన్లమోత మోగించుకుంటూ బస్‌ రాకడ వినపడుతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు హడావిడి...పిల్లల్ని పిలిచి వాళ్లని ఎక్కడికీ వెళ్లద్దు ఇంటిపట్టునే ఉండమని అప్పగింతలు అప్పజెప్పి రూపాయో పాపాయో వాళ్ళచేతుల్లో పెడతారు. సెల్లుఫోనూ, కాస్తంత చిల్లరా, కాసిన్నినోట్లూ బొందులున్న గుడ్డసంచీలోవేసి గట్టిగా లాగి బొందులు ముడేసి బొడ్లోదోపుకుని నెత్తిమీద కూరగాయల బుట్టలతో మెల్లగా కబుర్లాడుకుంటూ బస్సు తిరిగొచ్చే సమయానికి తీరిగ్గా ఒక్కొక్కరూ అది ఆగేచోటుకి చేరుకుంటారు.

రోజూ ఏ ట్రిప్పులో ఎవరు వతనుగా ఎక్కుతారో ఆ బస్‌ నడిపేటాయనకి గుర్తే. బస్‌ వచ్చి ఆక్కడ ఆగిన తర్వాత వాళ్ళల్లో ఎవరైనా కనబడకపోయినా, ఎవరైనా రావటం కాస్తంత ఆలస్యమైనా ఏవేవో ఊసులాడుకుంటూ కండక్టరూ, డ్రైవరూ వాళ్లకోసం ఆగుతారేతప్ప గేరుమార్చరు. ఉదయం పూట్లైతే బస్‌ దాటిపోతే వాళ్ళకి మరో దారి ఉండదు. అందుకే ఆ ఊరోళ్ల తట్టలూ, బుట్టలన్నీ ఎక్కించేదాకా మరో నిమిషం ఎక్కువైనా ఆగమాగం చెయ్యరు. పొద్దక్కేకొద్దీ మార్కెట్లో అమ్మకాలు తక్కువైపోతాయనే కష్టం తెలిసినోళ్ళు ఆ డ్రైవరూ కండక్టరూ. రోజూ కలిసే వాళ్ల మధ్య యథాలాపంగానే ఏర్పడ్డ అనుబంధమది.