గృహప్రవేశ మహోత్సవం! చేతిలో దేవునిపటంతో ఇంటాయన, దేవతా విగ్రహాలతో ఇంటి ఇల్లాలు నిలుచుని ఉన్నారు. కానీ నీళ్ళబిందెలతో రావాల్సిన ఆడపడుచు లేదు. పూజారి అదే అడిగాడు. దాంతో ఇంటాయన, రోజుకూలీ మీద వచ్చిన యువతిని పిలిచి ఆడపడుచు స్థానం ఇచ్చాడు. అదిచూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యంగా నిలబడిపోయారు. భార్య వారిస్తున్నా వినలేదతను. ఇంతకీ ఎవరా యువతి? ఆ ఇంటాయన ఆలోచనలో ఉన్న అంతరార్థం ఏమిటి?

మహానగరంలో... ఆధునికతకు ప్రతీకగా అభివృద్ధిలోకొస్తున్న ప్రాంతం. అక్కడక్కడ తవ్వబడు తున్న కొండలు, గుట్టలు. విశాలమైన స్థలాలు, ఎత్తయిన ప్రహరీగోడలు. గౌరి ఇంట్లోంచి బైటి కొచ్చి నెమ్మదిగా నడుస్తోంది. ఇల్లంటే ఫుట్‌పాత్‌ మీద, గోడకానించి, టార్పాలిన్‌ కప్పిన, సగం మాత్రమే పైకప్పున్న చిన్న గుడిసెలాంటిది. వేసుకున్న హవాయిచెప్పులు అరిగిపోయి, అరికాల్లో సగం దగ్గర ఆగిపోయాయి.‘‘అమ్మా!’’ అరుస్తూ నేలమీద కూలబడిపోయింది. బొటబొటా రక్తం... అక్కడున్న ఇసుక అద్ది, గట్టిగా పట్టుకుంది. నొప్పి ఓర్చుకుంటూ తలెత్తి చూసింది. కంటికాననంత ఎత్తుగా... లెక్కపెట్ట లేనన్ని అంతస్తులున్న భవనాలు. అక్కడక్కడ పడున్న టార్పాలిన్లకేసి చూసింది. ఇంక పనికి రావవి. ఒక్కటిస్తే చాలు తనకి. గుడిసె మీద వేసుకుంటుంది. లేచి, సర్దుకుని నడక మొదలెట్టింది.

‘‘గౌరీ! ఇట్రా... కుంటుతున్నావేందే?’’ నాలుగిళ్లవతలుండే నర్సమ్మ... కాంప్లెక్స్‌లో కూలిపని చేస్తుంది. గౌరి కూడా చేస్తుంది. కానీ ఓరోజు చేస్తే రెండ్రోజులు పడక. ఆ ప్రాంతాల్లో పిచ్చి దానిలా తిరుగుతున్న గౌరికి నర్సమ్మే ఆశ్రయం ఇచ్చి, దారి చూపించింది. ఒకటి తర్వాత ఒకటి కట్టే కాంప్లెక్సుల్లో, తనతో తిప్పుకుంటోంది.‘‘ఇయాల పన్లోకి రాలేదేం? నాజూకు బుచ్చి... ఇదివరకేం చేశా?’’ నర్సమ్మ చెయ్యి పట్టుకుని నడిపించింది. కూలివాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు.‘‘ఇళ్ళల్లో పనులు... చెప్పాగా! ఇంతింత బరువులెత్తడం అలవాటు లేదు. ఎక్కడైనా చూసుకుందామంటే ఇల్లే కనిపించడం లేదు. ఇంక తిరగటం నా వల్ల కాదక్కా!’’‘‘వచ్చేత్తార్లే... పస్టు పేసైపోయిందిగా. ఇంక వర్సగా గురప్రయేశాలే’’ అంది నర్సమ్మ. అందరి దగ్గరా తలో ముద్దా తీసి, తన డబ్బామూతలో పెట్టి ఇచ్చింది. మొహమాటపడుతూనే ఆవురావురుమని తినేసింది గౌరి. అక్కడున్న వాళ్లందరివీ అర్థాకలి బతుకులే. అందులోనే... తోటివారికింత ముద్ద. తిన్నది పావు కడుపు కూడా నింపలేదు. అయినా అస్సల్లేని దానికంటే నయమేగా! దణ్ణం పెట్టి లేచి ముందుకు నడిచింది.