రహస్యంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడతను. రైతు వేషం ధరించి మెల్లిగా ఊళ్ళోకి నడిచి వెళ్ళి ఒక పాడుబడిన షెడ్డులోకి ప్రవేశించాడు. అలికిడి విని ఆమె అప్రమత్తమైంది. లోపలికి వచ్చినవారిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేయాలని నిశ్చయించుకుందామె. పలుగు పట్టుకుని తలుపువెనుక సిద్ధంగా నిలబడింది. అతడు లోనికి ప్రవేశించాడు. ఆ క్షణంలో ఏం జరిగింది? అసలు ఆమె ఎవరు? అతడెవరు?
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఉంది రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) హెడ్ క్వార్టర్స్. అక్కడ ఒక అత్యవసర సమావేశం జరుగుతోంది. రక్షణరంగ రహస్యాల గురించి తెలిసిన అతికొద్ది మంది ప్రముఖులు అక్కడ కూర్చుని చర్చలు చేస్తున్నారు. విషయం అత్యంత సున్నితమైనది కావడంతో చర్చ వేడివేడిగా సాగుతోంది.‘‘ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది?’’ అడిగాడు ‘రా’ డైరెక్టర్.‘‘పాక్ ఆక్రమిత కశ్శీర్ ముజఫరాబాద్‌లో. మన సహాయం కోసం ఎదురుచూస్తూ....’’ చెప్పాడు పాకిస్థాన్ వ్యవహారాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్.వారి మధ్య సంభాషణను మిగిలినవారు జాగ్రత్తగా వింటున్నారు. ‘‘మీ ప్రపోజల్ ఏమిటి?’’ ఎటూ కమిట్ కాకుండా అడిగాడు డైరెక్టర్. ‘‘మన కమాండో యూనిట్ నుండి ఒక వ్యక్తిని పంపి ఆ అమ్మాయిని ఇక్కడకు రప్పించాలి’’‘‘లేకపోతే?’’‘‘కొన్ని రోజులుగా ఆ అమ్మాయిని మనం అక్కడ ఉంచాం.
మన దేశం మీద పరోక్షయుద్ధం ప్రకటించిన లష్కరే తోయిబా తన కార్యకలాపాలను పాక్ ఆక్రమిత కశ్శీర్ నుండి నడుపుతోందని మనకి తెలిసినా ఋజువులు లేవు. లష్కర్ సంస్థ అక్కడ ఎన్నో తీవ్రవాద శిక్షణా శిబిరాలు నడుపుతోంది. వాటిలో తర్ఫీదు పొందిన తీవ్రవాదులు రహస్యంగా మన దేశంలోకి ప్రవేశించి అనేక రకాల ఉత్పాతాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడా అమ్మాయి అక్కడ జరుగుతున్న అరాచకాలకు సంబంధించి అనేక సాక్ష్యాలు సంపాదించింది. ఆ అమ్మాయిని మనదేశం రప్పిద్దాం అనుకున్నాం. ఇంతలో ఆ అమ్మాయి మన గూఢచారి అన్న విషయం బైటపడిపోయింది’’ వివరంగా చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్. ‘‘విషయం బైటపడ్డాక మన మనిషి వెళ్ళి చేసేదేముంటుంది? తను కూడా పట్టుబడటం తప్ప’’ పట్టు విడవకుండా ఆ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాడు డైరెక్టర్. ‘‘ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో సహా ఒక రహస్య ప్రదేశంలో దాక్కుంది. మనం కొద్దిగా సహాయం చేస్తే ఆ సాక్ష్యాలు మనవవుతాయి. పాకిస్థాన్ చేస్తున్న కుట్ర అంతర్జాతీయ సమాజం ముందు బైటపెట్టవచ్చు...’’