వాడి పేరు సోముడు. పదేళ్ళుంటాయి వాడికి. తండ్రి లేడు. తల్లీ, ఓ నల్లమచ్చల తెల్ల ఆవుసహా ఊరుకి దూరంగా ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఆవు పాలే వారికి జీవనాధారం. పాలు అమ్ముకుంటూ బతుకుతున్నారిద్దరూ. రోజులు అలా గడుస్తుండగా పాపం! ఆవు ఒట్టిపోయింది. పాలు ఇవ్వడం మానేసింది. ఇక ఆవు పనికి రాదని, దానిని అమ్మి వేస్తానంది తల్లి. సంతకి బయల్దేరింది.‘‘ఆవును నేను అమ్ముకుని వస్తాను, నువ్వు ఇంట్లో ఉండు.’’ అన్నాడు సోముడు. తల్లిని ఇంట్లో ఉంచి, ఆవును తీసుకుని, సంతకి బయల్దేరాడు.‘‘ఓ రెండు వరహాలేనా వచ్చేట్టుగా చూడు. జాగ్రత్తగా బేరం చెయ్యి.’’ హెచ్చరించింది తల్లి. అలాగేనన్నట్టుగా తలెగరేశాడు సోముడు. వాగు దాటాడు. వంక దాటాడు. అడవి దారి పట్టాడు. అడవిలో కొంత దూరం ప్రయాణించి, కొండ దిగితే సంతకి చేరుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఆవుతో పాటుగా గబగబా నడుస్తున్న సోముని బుర్రమీసాలు గల ఓ వ్యక్తి పలకరించాడు.

‘‘ఎక్కడికయ్యా?’’ అడిగాడు.‘‘సంతకి’’‘‘అమ్మడానికా?’’‘‘అమ్మడానికే! ఈ ఆవును అమ్ముతాను.’’అన్నాడు సోముడు.‘‘ఎంతకి అమ్ముతావు?’’ అడిగాడు బుర్రమీసాల వ్యక్తి.‘‘రెండు వరహాలిస్తే ఆవునిస్తాను.’’‘‘రెండు వరహాలు లేవుగాని, ఈ జామపండు ఉంది. తీసుకుని నాకు ఆవుని ఇచ్చేయ్‌.’’ అడిగాడు బుర్రమీసాల వ్యక్తి. జామపండుకి ఆవుని ఇవ్వాలా? ఎంత ఆశ అనుకున్నాడు సోముడు. వాడి ఆలోచన గ్రహించినట్టున్నాడు బుర్ర మీసాల వ్యక్తి. ఇలా అన్నాడు.‘‘ఇది ఆషామాషీ జామపండుకాదు. చాలా మహిమ గలది. ఎందుకు చెబుతున్నానో విను, ఇది తీసుకుని నాకు ఆవుని ఇచ్చేయ్‌. నీకిక తిరుగు ఉండదు. మీకు అన్నీ మంచిరోజులే.’’‘‘ఎంత మహిమగలదైనా మరీ జామపండుకి ఆవుని ఇచ్చేయ్యాలా? అమ్మ తిడుతుంది.’’ అన్నాడు సోముడు.‘‘నీ ఇష్టం మరి.’’ అని బుర్రమీసాల వ్యక్తి వెళ్ళిపోతుంటే...ఆలోచించాడు సోముడు. మహిమగల జామపండు అంటున్నాడు. తిరుగు ఉండ దంటున్నాడు. అన్నీ మంచిరోజులే అంటున్నాడు. ఇచ్చేస్తే పోలే అనుకున్నాడు. పిలిచాడతన్ని.‘‘సరే! ఆ జామపండు ఇచ్చి, ఈ ఆవుని తీసుకో.’’ అన్నాడు. ఆవుని ఇచ్చి, జామపండు తీసుకున్నాడు. పరిశీలనగా చూశాడు దాన్ని. మిగిల ముగ్గిన పండు. మంచివాసన వేస్తోంది. అదిమితే చాలు, విచ్చుకునేట్టుగా ఉంది. దానిని జాగ్రత్తగా పట్టు కుని వెను తిరిగాడు సోముడు. పరిగెత్తాడు. ఇంటికి చేరుకున్నాడు.