‘‘హలో మూర్తిగారూ ... మీ అబిడ్స్‌ బ్రాంచి బిజినెస్‌రివ్యూ చేశాం. మీరు చార్జి తీసుకున్నాక మంచి ఫలితాలు సాధిస్తున్నారు. బిజినెస్‌ పెరుగుతోంది. అభినందనలు.’’జనరల్‌ మేనేజర్‌ సదానందం ప్రశంసలకుసెల్‌లో కృతజ్ఞతలు తెలియజేశాడు కృష్ణమూర్తి, ఎబిసిబ్యాంక్‌ అబిడ్స్‌ బ్రాంచి సీనియర్‌ మేనేజర్‌.

‘‘మీ బ్రాంచి ఎదురుగా దీపక్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యూయలరీ అని బిగ్‌ షోరూమ్‌ వుంది. వారికి దేశమంతా అలాంటివి అరవై షోరూమ్స్‌ వున్నాయట. ఆ కంపెనీ ఎమ్‌.డి. దీపక్‌ మిశ్రా నిన్న లయన్స్‌ క్లబ్‌లో నన్ను కలిశాడు. మన బ్యాంకులో ఖాతా తెరవమని రిక్వెస్టు చేశాను. సానుకూలంగా స్పందించాడు. వెంటనే వెళ్ళి ఆయన్ని కలవండి ...’’ చెప్పాడు సదానందం.‘‘అలాగే ... ఇప్పుడే కలుస్తాను సార్‌’’ అన్నాడు కృష్ణమూర్తి. సెల్‌ కట్‌ అయింది.ఎబిసి బ్యాంక్‌ తెలంగాణ పరిధిలోని బ్రాంచిల పర్యవేక్షణాధికారి జనరల్‌ మేనేజర్‌ సదానందం గారి ఎడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీస్‌ సికింద్రాబాద్‌లో వుంది. మూడు నెలల కొకసారి తన పరిధిలోని బ్రాంచిల బిజినెస్‌ రివ్యూ చేసి మేనేజర్లకు తగిన సలహాలివ్వడం జనరల్‌ మేనేజర్‌ విధుల్లో ముఖ్యమైనది.

బాస్‌ పొగడ్తలకు గర్వంగా ఫీలయ్యాడు కృష్ణమూర్తి. ‘‘మీరు పగలూ రాత్రీ బ్యాంకు బిజినెస్‌ గురించే ఆలోచిస్తారు. కుటుంబ విషయాలు పట్టవు’’ అని భార్య రోజూ సణగడం కృష్ణమూర్తి తలపుకొచ్చింది.‘ఏమిటో బ్యాంకుతో విడదీయలేని అనుబంధం’ అనుకుంటూ కృష్ణమూర్తి బ్రాంచి బయటకొచ్చి రోడ్డు దాటి అవతలవైపున్న దీపక్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యూయలరీ షోరూమ్‌లోకి ఆతృతగా ప్రవేశించాడు.దీపక్‌ మిశ్రా సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఎమ్‌.డి. ఛాంబర్స్‌లో వుంటారని తెలుసుకుని లిఫ్ట్‌లో సెకండ్‌ ఫ్లోర్‌ చేరుకున్నాడు. విశాలమైన ఆఫీసు ... సెంట్రల్‌ ఏ.సి. చల్లగా వుంది. పదిహేనుమంది స్టాఫ్‌ కంప్యూటర్స్‌ ముందు కూర్చుని పని చేసుకోవడం గమనించాడు కృష్ణమూర్తి.

రిసెప్షనిస్ట్‌కు తన విజిటింగ్‌ కార్డ్‌ అందించి విజిటర్స్‌ లాంజ్‌లో కూర్చున్నాడు. పావుగంట తరువాత మిశ్రాగారిని కలవడానికి అనుమతి లభించి ఎమ్‌.డి. రూములో అడుగుపెట్టాడు.ఖరీదైన నల్లటి సూటులో పచ్చని ఛాయతో మెరిసిపోతున్న దీపక్‌ మిశ్రా సాదరంగా కృష్ణమూర్తిని ఆహ్వానించాడు. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. మిశ్రా నాలుగు వేళ్ళకి మెరుస్తున్న ఉంగరాల్ని గమనిస్తూ సోఫాలో కూర్చున్నాడు కృష్ణమూర్తి.