‘‘ప్రేమను అన్వేషించడం మన పని కానేకాదు. దానికి అడ్డంగా అంతరాంతరాల్లో ఉన్న అవరోధాలను తీసేస్తే చాలు, ప్రేమ ఆవిష్కృతమవుతుంది.’’ - రూమీ

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ

పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ

శ్రీ సూర్యనారాయణ మేలుకోహరిసూర్యనారాయణ ....

అలాగ పొద్దు పొడుస్తూ ఉన్నప్పుడే నేనూ, అమూల్యా సముద్రపొడ్డుకు వెళ్లిపోయాం.ప్రేమను తెలియజేసి వెళ్లిపోయిన కుర్రాడికి ఏం సమాధానమివ్వాలా అని ఆలోచించుకునే పడుచులాగా పుష్యమాసం వెళ్లిపోయినా చలి ఇంకా వెళ్లనా, వద్దా అన్నట్టు దోబూచులాడుతోంది. మామూలుగానైతే ఇలాంటి సమయాల్లో ఎక్కడ నిలుచున్నా, అమూల్య చేతులు నా చుట్టూ ఉండేవి, తల నా ఛాతీకి దగ్గరగా ఆని ఉండేది, నేను తనను వీలయినంత దగ్గరగా పొదువుకుని ఉండేవాణ్ని. మా ఇద్దరినీ కప్పుతూ శాలువానో, పెద్ద స్వెట్టరో ఒకటి ఉండేది.కాని ఇప్పుడు అమూల్య తన స్వెట్టర్‌ తనే వేసుకుంది, నా హుడీ జాకెట్‌ నేను వేసుకున్నాను. పక్కపక్కనే నిల్చున్నామన్న మాటేగానీ, ఒకరి చేతులు మరొకరికి తగలడం లేదు. ఆమెలోపలి అలజడి నాకు తెలుస్తోంది.

‘‘అంతా బాగా అవుతుంది అమూల్యా, నువ్వేం కంగారుపడకు’’ అంటూ దగ్గరగా హత్తుకున్నాను.ఉల్లి పువ్వు రంగులో భానుడు ఉదయిస్తూ ఉన్నాడు. మరి కొందరు బీచ్‌లోకి వస్తూ ఉన్నారు.మూడేళ్ల క్రితం మేమిద్దరం కలిసిన సందర్భం గుర్తొస్తూ ఉంది.ఎప్పుడూ జరిగే అడ్వెంచర్‌ ట్రిప్పులూ, ట్రెక్కింగులూ కాకుండా, అప్పుడు లిటరరీ ఫెస్టివల్‌ అంటూ నిర్వహించారు మా హెచ్చార్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు.ఆఫీసు ఆవరణలోనే లాన్‌లో కనకాంబరం రంగు కాగితప్పూల చెట్ల కింద గుండ్రంగా కుర్చీలేసి కూర్చోబెట్టారు అందరినీ. జీన్స్‌ మీద తెల్లటి కుర్తా, చిన్న జుంకాలు పెట్టుకున్న పిల్ల లేచి నిలబడింది.

‘‘ఊహ తెలిసి, తొలి ప్రేమకథ విన్నప్పుడే నీ గురించి వెతకడం మొదలుపెట్టాను. అదెంత పిచ్చితనమో అప్పుడు నాకు తెలియలేదు. ప్రేమికులు బయట ప్రపంచంలో ఎక్కడో కలుస్తారనుకోవడం ఉత్తి భ్రమ. వాళ్లెప్పుడూ ఒకరిలో మరొక రుంటారు...’’ అంటూ రూమీ కొటేషన్‌ చెప్పింది అమూల్య.‘‘నేను నిన్ను నా హృదయంతో ప్రేమించడం లేదు, బుద్ధితోనూ ప్రేమించడం లేదు. ఎందుకంటావా? హృదయం ఎప్పుడైనా ఆగిపోవచ్చు, బుద్ధి మరిచిపోవచ్చు. నిన్ను నేను నా ఆత్మతో ప్రేమిస్తున్నాను, అదెప్పుడూ ఆగిపోదు, మరిచిపోదు, నాశనం కాదు..’’