చదరంగం బోర్డుమీదున్న అరవైనాలుగు గళ్ళలో కొన్ని గళ్ళను ఆక్రమించి ఉన్న చతురంగ బలాలవైపు దీక్షగా చూస్తున్నాడు అనిల్‌. నేను ఉత్కంఠగా అతను వేయబోయే ఎత్తుకోసం ఎదురుచూస్తున్నాను. ఒక తప్పు ఎత్తువేస్తే చాలు... నేను గెలవడం ఖాయం.. ఇద్దరం ప్రాక్టీస్‌ కోసం ఆడుతున్న ఆటే ఐనా చెస్‌లో జాతీయ ఛాంపియన్ని ఓడించానన్న తృప్తి మిగుల్తుంది. ఓహ్‌! ఎంత బలమైన, అపురూపమైన కోరికో.

అనిల్‌ మరికొన్ని క్షణాలు తీవ్రంగా ఆలోచించి, ఏనుగుని కిందికి జరిపాడు. నేను ఆశ్చర్యపోతూ అతనివైపు చూశాను. పసిపిల్లాడిలా నవ్వుతున్నాడు అనిల్‌. ‘కావాలనే ఏనుగుని జరిపాడా? ఇందులో ఏమైనా వ్యూహం దాగుందా? నా మంత్రితో చెక్‌పెట్టే ప్రమాదం ఉందని తెలిసి కూడా...!’ నేను మంత్రిని ముందుకు జరిపి ‘చెక్‌’ అన్నాను. అతను రాజుని పక్కకు జరిపాడు. కానీ మంత్రిని రక్షించుకోలేకపోయాడు. అదేమీ పట్టించుకోకుండా రెండో ఏనుగుని ముందుకు జరిపాడు. మరో మూడుఎత్తుల్లో నాకు చెక్‌మేట్‌ చెప్పాడు. ఎటూ కదల్లేని పరిస్థితి. రెండు ఏనుగులతో ఓ గుర్రంతో నా రాజును బంధించేశాడు.నేను ఖంగుతిని విభ్రమంగా అతనివైపు చూశాను.

గెలుపు ఖాయం అనుకుంటున్న క్షణాల్లో ఈ ఓటమి ఏమిటి? మింగుడు పడటం లేదు.‘‘నువ్వు ఎప్పుడూ చేసే తప్పే చేశావు అభిరాం. యుద్ధంలో వైరిసైనికుల మీద విరుచుకుపడినంత మాత్రాన విజయం లభించదు. ఏ సమయంలో దాడి చేయాలనేది చాలా ముఖ్యం. దానికి చాలా సంయమనం అవసరం. నువ్వు చెక్‌ చెప్పడంలో చూపిస్తున్న ఆసక్తి, ఎప్పుడు చెక్‌ చెప్పాలనే దానిమీద చూపించడం లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ఏ ఆటలోనైనా విజయరహస్యం. జీవితచదరంగంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది’’ అన్నాడు అనిల్‌.